Tuesday, November 5, 2024

నైరోబిలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నైరోబి : కెన్యా రాజధాని నైరోబిలో శుక్రవారం వేకువ జామున గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్ పేలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా, ఇళ్లు, గోదాములు భస్మీపటలం అయ్యాయి. ఆ ప్రమాదంలో కనీసం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, 270 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నైరోబి శివార్లలోని మ్రాడి ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అగ్ని జ్వాలలు ఇళ్లకు వ్యాపించినప్పుడు అనేక మంది ఇళ్లలోనే ఉండవచ్చునని ప్రభుత్వ ప్రతినిధి ఐజాక్ మవారా తెలిపారు.

ట్రక్ విస్ఫోటం వల్ల పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లాయి. ఆ ధాటికి పైకి ఎగసిన ఒక గ్యాస్ సిలిండర్ మంటలను వ్యాపింపచేయగా దుస్తులు, వస్త్రాల గిడ్డంగి ఓరియంటల్ గోడౌన్ భస్మీపటలం అయిందని మవారా తెలియజేశారు. గురువారం రాత్రి 11.30 గంటలకు మొదలైన అగ్ని ప్రమాదంలో పలు ఇతర వాహనాలు, వ్యాపార సంస్థలు ధ్వంసం అయ్యాయి. శుక్రవారం వేకువ జామున పలు ఇళ్లు, దుకాణాలు దగ్ధమై ఉండడం కనిపించింది. ప్రమాద స్థలం చెల్లాచెదురైన శిథిలాలతో నిండిపోయింది. ఆ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు, కెన్యా రెడ్ క్రాస్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎంబకాసి పోలీస్ చీఫ్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News