ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో మంటలు చెలరేగడంతో 40 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలోని శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుగంధ నదిపై ప్రయాణిస్తున్న ఓ మూడు అంతస్తుల నౌకలో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి.నౌకలో మంటలు తక్కువ వ్యవధిలో వ్యాపించడంతో 40మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు. భయభ్రాంతులకు గురైన కొందరు ప్రయాణికులు నదిలోకి దూకారు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, దానివల్ల మృతుల, క్షతగాత్రుల సంఖ్య పెరిగిపోయింది. ఢాకా నుంచి తిరిగివస్తున్న నౌక ఇంజన్ గదిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 150 మంది గాయపడగా బారిసాల్‌లోని ఆసుపత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మూడుదశల విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.