బంగారు వర్తకానికి ప్రసిద్ధి చెందిన త్రిసూర్‌లో బంగారు నగల తయారీ యూనిట్లపై కేరల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జిఎస్‌టి) భారీ స్థాయిలో దాడులు జరిపి లెక్కల్లో చూపని 104 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 75 కోట్లు ఉంటుంది. టోరే డెల్ ఓరో పేరిట(ఫ్రెంచ్‌లో బంగారు స్తంభం) నిర్వహించిన ఈ ఆపరేషన్ బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువారం కూడా కొనసాగింది. 700 మందికిపైగా అధికారులు జిల్లావ్యాపగా 78 ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు. బంగారు నగల తయారీ యూనిట్లతోపాటు నగల వ్యాపారుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
గత ఆరు నెలలుగా నగల తయారీదారులు జిఎస్‌టి మోసానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర జిఎస్‌టి శాఖకు చెందిన నిఘా విభాగం దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. 104 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసకున్న అధికారులకు బిల్లింగ్, ట్యాక్సేషన్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారని వారు చెప్పారు. కాగా..దాడులలో లెక్కల్లో చూపని 120 కిలోల బంగారాన్ని జిఎస్‌టి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు ఇంతకుముందు వెల్లడించారు.