Saturday, January 11, 2025

పూంచ్‌లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు

- Advertisement -
- Advertisement -

మెంథార్/జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్) కాన్వాయ్‌పై శనివారం దాడి జరిగిన తరువాత ఉగ్రవాదుల కోసం ఆదివారం భారీ ఎత్తున గాలింపు కొనసాగింది. శనివారం సాయంత్రం షాసితార్ సమీపాన ఐఎఎఫ్ జరిగిన దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, మరొకరు తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఆదివారం నాడు అనేక మందిని అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సురాన్‌కోట్ ఏరియాలో దాడి జరిగిన ప్రాంతాన్ని జమ్ము అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్‌జైన్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులు ఆదివారం సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఆర్మీ ఏరియల్ సర్వే చేపట్టింది. షాసితార్, గుర్సాయి, సనాయి, షీందార, ప్రాంతాలను ఆర్మీ, పోలీస్ బృందాలు జల్లెడపడుతున్నాయి. దాడి తరువాత ఉగ్రవాదులు అడవి లోకి పారిపోయారని భావిస్తున్నారు. ఎక్కువ మంది ప్రాణాలను బలిగొనడానికి దుండగులు ఎకె రైఫిల్స్‌తోపాటు అమెరికా తయారీ కార్బైన్ , స్టీల్ బులెట్లను కూడా ఉపయోగించారు. శనివారం దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు కార్పొరల్ విక్కీ పహాడేగా ఐఎఎఫ్ గుర్తించింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసింది.

పూంచ్ సెక్టార్‌లో దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తి విక్కీ పహాడేకు నివాళులు అర్పిస్తున్నామని సిఎఎస్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, ఇతర ఐఎఎఫ్ అధికారులు తన సంతాపంలో పేర్కొన్నారు. ఆర్మీ పారా కమాండోలను కూడా ఈ గాలింపు చర్యల్లో రంగం లోకి దింపామని అధికారులు వెల్లడించారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనంతనాగ్‌రాజౌరీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భాగంగా ఉన్న పూంచ్‌లో మే 25 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో గత రెండు ఏళ్లుగా ఉగ్రకార్యకలాపాలు, దాడులు సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News