కరెన్ విముక్తి సంస్థపై సైన్యం దాడుల ఫలితం
యాంగూన్ : నిరసనలు, కాల్పులతో దద్దరిల్లుతున్న మయన్మార్‌లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు వలస వెళ్లుతున్నారు. సరిహద్దులలోని కరెన్ ప్రాంతంలో తిరుగుబాటుదార్లు ఉన్నారనే అనుమానాలతో మయన్మార్ సైన్యం భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగుతూ వస్తోంది. దీనితో ఇక్కడి కరెనె తెగ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వేలాది మంది ఆదివారం నుంచే ఇరుకైన నదీ మార్గాలు, కందకాలు లోయలను దాటుకుంటూ థాయ్‌కు చేరుకుంటున్నారని ఈ ప్రాంతపు మానవీయ సహాయ సంస్థ ఫ్రీ బర్మా రేంజర్స్ తెలిపింది. మరింత ఎక్కవ సంఖ్యలో ఈ తెగవారు తరలివస్తారనే భయాలతో థాయ్ అధికారులు కట్టడి చర్యలు వేగవంతం చేశారు. మయన్మార్ సైన్యం హుటాహుటిన వైమానిక దాడులకు పాల్పడటం, బాంబులు కరిపిస్తూ ఉండటంతో ఆ ప్రాంతంలో పిల్లలతో పాటు పలువురు గాయపడ్డారు.
ప్రస్తుత పరిణామంతో తమ పశ్చిమ సరిహద్దుల వెంబడి వలసల సమస్య ఏర్పడిందని థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఒచా సోమవారం తెలిపారు. తమకు కొత్త సమస్యలు కొనితెచ్చుకోవడం ఇష్టం లేదని, అయితే మానవ హక్కులను పట్టించుకుంటామన్నారు. ఇప్పటికే 200 మంది విద్యార్థులతో పాటు మొత్తం మీద 3వేల మంది సరిహద్దు ప్రాంతపు జనం సాల్వీన్ నదిని దాటి ఉత్తర థాయ్‌లాండ్‌లోని మీ హంగ్ సాన్ ప్రాంతానికి చేరారు, మయన్మార్ ఉత్తర భాగపు కరెన్ రాష్ట్రం నుంచి ఇప్పటి పరిణామాలతో దాదాపు 10వేల మంది ఇళ్లు వదిలిపెట్టి పోవల్సి వస్తుందని బర్మా ఫ్రీ రేంజర్స్ సంస్థ తెలిపింది.
కరెన్ ప్రాంతంలో వెలిసిన కరెన్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ శనివారం ఉదయం మయన్మార్ సైనిక ఔట్‌పోస్టుపై దాడికి దిగడం , దీనిని కైవసం చేసుకోవడంతో దీనికి ప్రతిచర్యగా వరుసగా మయన్మార్ సైనిక విమానాలు ఈ ప్రాంతంలో దాడులకు దిగుతూ వస్తున్నాయి. కరెన్ లిబరేషన్ ఆర్మీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిని కోరుకొంటోంది. ఈ మధ్య కాలంలో సైనిక జుంటాపై నిరసనగా మయన్మార్‌లో భారీ స్థాయిలో ప్రదర్శనలు చెలరేగిన దశలోనే సైన్యాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ కరెన్ సంస్థ గెరిల్లా తరహాలో దాడులకు దిగుతోంది.