Thursday, January 23, 2025

10 లక్షల మందితో 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ : బండి

- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే నెల 2, 3 తేదీల్లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ (ఎన్‌ఈసీ) సమావేశాలను దిగ్విజయవంతం చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 3న సాయంత్రం కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాద్‌లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. తుక్కుగూడ సభకు మించి సామాన్య ప్రజలతో సభ నిర్వహింబోతున్నామన్నారు. సభాస్థలి వేదిక  ఖరారుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారితోపాటు సామాన్య ప్రజలు కూడా బహిరంగ సభకు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఈసీ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్‌తోపాటు ఎన్‌ఈసీ ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర నేతలు సోమవారం నోవాటెల్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్‌ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తోపాటు మాజీ ఎంపి చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎంఎల్‌సి రామచంద్రరావు, మాజీ ఎంఎల్‌ఎలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, బంగారు శ్రుతి, కొల్లి మాధవి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి, గడీల శ్రీకాంత్ సహా పలువురు నేతలు బండి సంజయ్‌తోపాటు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 34 విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత 15 రోజులుగా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నామన్నారు. ఎన్‌ఈసీ సమావేశాల్లో భాగంగా ఉదయం పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. సమావేశాల ముగింపు అనంతరం సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి, ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. స్థానిక నాయకులను కలవాలని,. ఈవెంట్‌కు ముందు ప్రజలను సమీకరించడానికి వారి మద్దతు కోరాలని కూడా వారిని కోరారు. అందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి బహిరంగ సభకు ఆహ్వానాలు అందజేయాలని కోరారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటును 10 వేల మంది సభకు హాజరయ్యేలా చూడాలన్నారు.
జూన్ 22న తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి సమా వేశానికి హాజరు కావాలని ప్రజలను ఆహ్వానిం చాలని బండి సంజయ్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో విరా ళాలు సేకరించవద్దని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. పార్టీ రాష్ట్ర శాఖ పేరుతో ఉన్న ఖాతాకు డిజిటల్ చెల్లింపుల రూపంలో మాత్రమే విరాళాలు సేకరించాలని చెప్పారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News