ఆడిటర్ జనరల్ నివేదికలో తేలిన స్కామ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ సారధ్యపు బిజెపి ప్రభుత్వం అవినీతి పనులతో పేద పిల్లల పౌష్టికాహార పథకానికి తూట్లు పొడుస్తోంది. పిల్లల పోషణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకం కళ్లు బైర్లు కమ్మే అవినీతితో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న ఈ పథకం తీరు తెన్నులపై మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ అత్యంత రహస్యమైన 36 పేజీల నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఓ ప్రముఖ మీడియా సంస్థ రాబట్టింది.
ఆహార పథకానికి అవసరం అయిన రేషన్ సరుకుల రవాణా ట్రక్కులు మొదలుకుని లబ్ధిదారుల సంఖ్య అతిగా చూపడం వరకూ పలు అక్రమాలు జరిగినట్లు తేలింది. రేషన్ రవాణా ట్రక్కుల పేరిట బైక్‌లను రంగంలోకి దింపారు. తప్పుడు నెంబర్ల వాహనాల జాబితాను ఇచ్చి బిల్లులు పొందారని వెల్లడైంది. ఈ క్రమంలో పేద పిల్లలకు సరైన రీతిలో ఆహారం అందకపోవడం, మధ్యవర్తులకు, డీలర్లకు భారీస్థాయిలో కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించడంతో ప్రజలపై ఈ భారం పడుతోందని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆడిటర్లే తమ నివేదికలలో తెలిపారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్రతిష్టాత్మక రీతిలో ఉచిత ఆహార సరఫరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
అయితే ఇందులో పలు దశలలో అవినీతి చోటుచేసుకుందని స్పష్టం అయింది. 2021 సంవత్సరానికి సంబంధించి ఈ పథకంలో పలు అవకతవకలు జరిగినట్లు , ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు లెక్కలలో తేల్చారు. పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంచుకోవడం, వారికి ఇంటికి రేషన్ సరఫరా చేయడం , నమోదు అయిన 49 లక్షల మందికి పైగా పిల్లలు, మహిళలకు అవసరం అయిన పౌష్టికాహారం అందించడం లక్షంగా పెట్టుకున్నారు. అయితే ఇందులో పలు తప్పిదాలు జరిగాయి. రికార్డులలో అత్యధిక సంఖ్యలో లెక్కలు చూపడం , వేలల్లో సరుకుల పంపిణీ చేయడం జరిగింది. స్కూళకు వెళ్లలేని స్థితిలో ఉన్న బాలికల లెక్కలలో అనేక విధాలుగా అక్రమాలు జరిగాయి. ఈ విధంగా రాష్ట్రంలో చదువుకునే స్థితిలో ఉన్న బాలికల సంఖ్య 9వేల వరకూ ఉందని అధికారిక సర్వేలో తేల్చారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఇటువంటి పిల్లల సంఖ్య 36 లక్షల వరకూ ఉందని తేల్చి వారికి పౌష్టికాహార పంపిణీ కింద బిల్లులు తీసుకున్నట్లు ఆడిట్‌లో వెల్లడైంది.
ఆడిట్ తేల్చిన స్కామ్ వికృతరూపాన్ని తెలిపే విధంగా ఆహార ధాన్యాల సరఫరా లెక్కలు ఉన్నాయి. ఈ పథకం పరిధిలో పంపిణీ కావల్సిన ఆహార ధాన్యాల వాటాలో ఇప్పటికీ 10000కు పైగా మెట్రిక్ టన్నుల రేషన్ ( దీని విలువ రూ 62 కోట్లుపైగా ఉంటుంది) ఎటు రవాణా అయిందో తేలడం లేదు. ఇది రవాణా అయిన సరుకుల జాబితాలో లేదు. ప్రభుత్వ గిడ్డంగులలో లేదు. దీనితో ఇది ఇతరత్రా మార్గాలలో బ్లాక్ మార్కెట్‌కు తరలి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలో తెలిపారు.