జీరో వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు
వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు
భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి
వ్యాపారుల రిటర్న్‌ల దాఖలుపై కొరవడిన పర్యవేక్షణ
పాత బకాయిలు, పన్ను ఎగవేతదారులపై
దృష్టి సారించని అధికారులు
జడ్చర్లలలో పనిచేసే అధికారిపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు
మూడు అదనపు బాధ్యతలతో రోజుకు లక్షల్లో వసూళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిముఖ్యమమైన వాణిజ్య పన్నుల శాఖ. ఆ శాఖ రాబడి పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నా అధికారులు మాత్రం అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆదాయం పెంపుపై కొందరు సీనియర్ అధికారులు సూచనలు చేసినా వాటిని ప్రస్తుత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సీనియర్‌లు సూచించిన వాటిలో కొన్ని జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారుల సంఖ్య పెంచడం, రిటర్నుల దాఖలు సక్రమంగా జరిగేలా చూడటం, జీరో వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం, పాతబకాయిలు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించినా అవన్నీ బుట్టదాఖలవుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్టీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఆయా సర్కిళ్ల పరిధిలో పనిచేసే సిటిఓలు వ్యాపారులను బెదిరించి డబ్బులను వసూళ్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అధిక రాబడి హైదరాబాద్ పరిధిలోని సర్కిళ్ల నుంచే
రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్లు ఉన్నా అత్యధిక రాబడి హైదరాబాద్ పరిధిలో ఉన్న డివిజన్‌ల నుంచే వస్తోంది. ఆయా డివిజన్‌ల నుంచి వాస్తవంగా రావాల్సినంత రావడం లేదని ఆ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, చార్మినార్ హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, మాదాపూర్, సికింద్రాబాద్ డివిజన్‌లతో పాటు రాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ డివిజన్‌ల నుంచి వసూళ్లు బాగా తగ్గుతున్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర సరకు రవాణాపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల కూడా ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వానికి ఈ మధ్య కొందరు ఆ శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.
ఆదాయం తగ్గడానికి ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా జీరోవ్యాపారం జోరుగా సాగుతోందని, దీనిని కొందరు అధికారులు ప్రోత్సహించడం కారణమని కూడా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న సరకులను పన్ను చెల్లించకుండానే విక్రయిస్తుండటం ఇది తెలిసినా కొందరు సిటిఓలు ఆయా వ్యాపారుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసి చూసీచూడనట్టుగా వదిలేస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుందని కొందరు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వే బిల్లుల దుర్వినియోగం, రిటర్ను దాఖల్లో అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆ శాఖలో మొండి బకాయిల వసూలుకు ఇప్పటికే వన్‌టై సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్ని సంస్థలు చెల్లింపులకు ముందుకొచ్చినా కొందరు అధికారుల నిర్లక్షం వల్ల అది ముందుకుసాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జడ్చర్‌లలో పనిచేసే ఓ డిసిటిఓ రోజుకు రూ.5 నుంచి రూ.10 లక్షల వసూళ్లు
నల్గొండ డివిజన్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పనిచేసే ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారి (డిసిటిఓ)తో పాటు మరో రెండు బాధ్యతలను నిర్వహిస్తూ రోజుకు రూ.5 నుంచి రూ.10 లక్షలను వసూళ్లు చేస్తున్నారని ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందాయి. ఆయన పోస్ట్ డిసిటిఓ, కానీ, ఆయన ఆడిట్ సిటిఓగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిటిఓగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, వ్యాపారులను బెదిరిస్తున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం.
విద్యానగర్‌లో పనిచేసే ఓ సిటిఓ
జీడిమెట్ల సర్కిల్‌లో పనిచేసే సిటిఓ డబ్బులు లేనిదే పనిచేయరని అక్కడి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆబిడ్స్‌లో పనిచేసే ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులను పెట్టి వసూళ్లకు పాల్పడుతోందని వ్యాపారులు గతంలోనూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆబిడ్స్ డివిజన్ పరిధిలో డిప్యూటేషన్‌లో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ ప్రతి వ్యాపారితో సత్ససంబంధాలు ఏర్పాటు చేసుకొని జీరో దందాలో భాగస్వామిగా మారినట్టుగా సమాచారం. పంజాగుట్ట డివిజన్‌లో పనిచేసే ఓ సిటిఓ ఆ డివిజన్ పరిధిలోని అన్ని సర్కిళలోనూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన కార్యాలయంలోని డి సెక్షన్‌లో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ ఆ శాఖ ఉద్యోగుల సర్వీసు మేటర్‌కు సంబంధించి ఫైళ్లను చూస్తారని ఆయన ప్రతి ఫైలుకు డబ్బులు డిమాండ్ చేస్తారని, దానికి ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తుండడం విశేషం. సరూర్‌నగర్ డివిజన్‌లో పనిచేసే ఒకరిద్దరూ సిటిఓలపై భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం గమనార్హం. సికింద్రాబాద్ డివిజన్‌లోని విద్యానగర్‌లో పనిచేసే ఓ సిటిఓ వ్యాపారులను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని రూల్స్ పేరుతో వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని వ్యాపారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. మాదాపూర్ డివిజన్‌లో పనిచేసే ఒక డిప్యూటీ కమిషనర్, ఇద్దరు సిటిఓలు ఆ డివిజన్ జేసి అండదండలతో ఐటీ కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని నొక్కేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొంత అవసరాలకు ఆ శాఖ వాహనాలు
ఇన్‌వార్డు సెక్షన్‌కు వచ్చే ఫిర్యాదులను కొందరు ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వినియోగించుకుంటున్నారని, ఆ ఫిర్యాదుల గురించి అవతలి వారికి చేరవేసి వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని సమాచారం. ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అండదండలతోనే ఈ వసూళ్ల దందా జరుగుతున్నట్టుగా తెలిసింది. కొందరు ఉద్యోగులు ఆ శాఖకు చెందిన వాహనాలను తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని డీజిల్ ఖర్చును కూడా ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.