Thursday, January 23, 2025

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45డిగ్రీల వరకు చేరింది .మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.రానున్న రోజులలో ఎండల తీవ్రత మరింత పెరిగి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశమూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాం తాల్లోనూ 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెప్పారు. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్, జనగాం, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

14 జిల్లాల్లో వడగాల్పులు, ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో ఈ వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.నాలుగైదు రోజు ల క్రితం వరకు పగటి ఉష్ణోగత్రలు పెరిగినా, రాత్రి సమయంలో చల్లని గాలులు వీచాయి. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. రాత్రివేళల్లో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అవసరమైతేనే బయటకు రండి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎండ వేడి నుంచి రక్షించుకునేందుకు మంచినీటితో పాటు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్ బారినపడకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

రోజురోజుకీ ఎండ లు పెరిగిపోతున్నాయి.మొన్నా మధ్య రెండు రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజు ల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. సహజంగా మనిషి రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే, కొబ్బరి నీరు, నిమ్మకాయనీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనంలభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సివస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం కూల్ వాటర్, చల్లని పదార్థాలు తీసుకోవడానికే అందరూ ఇష్టపడతారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు చికాకును కలిగిస్తాయి. ఏవి మేలు చేస్తాయో, ఏవి మంచి చేస్తాయో తెలుసుకుందాం. వంటకాల్లో సహజంగా సుగంధద్రవ్యాలు వాడుతుంటారు. ఇవి రుచిని కూడా పెంచుతాయి.

అయితే వేసవిలో వీటిని కొంచెం తగ్గించుకోవాలి. వీలైనంత ఎక్కువగా వాటర్ తాగాలి. అదే విధంగా మాంసాహారం, చేపలు, చికెన్, సీ ఫుడ్స్ వంటివి కడుపులో చికాకును కలిగిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం బెటర్. వేపుడు పదార్థాలు, బర్గర్లు, మిర్చి బజ్జీలు సహా వివిధ ఆయిల్ ఫుడ్స్, వేడివేడి కాఫీ లేదా టీ తీసుకోవడం అనేవి చికాకును పెంచుతాయి. ఈ సీజన్లో ఎలాంటి సాస్ను కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఇందులో 350 కేలరీలు ఉంటాయి వివిధ సమస్యలకు దారి తీస్తాయి. రోజూ తినే ఆహారంలో పెరుగు, మజ్జిగను తీసుకోవడం వేసవిలో చాలా మేలు చేస్తుంది. ఉదర సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండే దోసకాయ తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. పుదీనా కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి దీనిని రసాన్ని నిమ్మకాయ రసంతోపాటు నీళ్లలో కలిపి తాగడం చాలా మంచిది.

చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.
జల్జీరా: నాలుగు చెంచాల ఆమ్చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్జీరా మిశ్రమం రెడీ అవుతుంది. అది తాగితే డీ హైడ్రేషన్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.షర్బత్: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయట పనులు చక్కబెట్టుకోవడం ఉత్తమం.

బయటకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకొవాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమట పొక్కుల సమస్య ఉండదు. ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్ల సబ్జా గింజలను నానబెట్టుకుని తినాలి. లేదా గాజు గ్లాసులో మూడు వంతుల నీళ్ళను పోసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం ఖండ శక్కర (మిశ్రి) వేసి ఉదయం నానబెట్టి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆ నీటిని క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలో ఉన్న అధిక వేడిని ఇది నివారిస్తుంది. ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నేరుగా తినలేని వారు రుచి కోసం కొంచెం చక్కర కలుపుకుని తినవచ్చు.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News