Friday, November 22, 2024

ఎస్‌బిఐ ఎటిఎంలో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఎస్‌బిఐ ఎటిఎంలో భారీ చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఒక కారులో వచ్చిన దొంగలు ఎటిఎంను పగులగొట్టి అందులో ఉన్న 20 లక్షల నగదును అపహరించుకొని పారిపోయారు. అంతేకాకుండా దుండగులు ఎటిఎం యంత్రాన్ని ధ్వంసం చేసి మిషన్ పరికరాలను ఎటిఎం గది ముందు పడేశారు. గురువారం తెల్లవారుజామున ఎటిఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు చేరుకొని చోరీ జరిగినట్లు నిర్ధారించి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. బోధన్ ఎసిపి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ జయేష్‌రెడ్డి, వర్ని ఎస్‌ఐ కృష్ణ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల ద్వారా సమాచారాన్ని సేకరించారు.

క్లూస్ టీం ద్వారా ముద్రలు సేకరించి గ్యాస్ కట్టర్ల సహాయంతో దోపిడీకి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎటిఎం గదిలో అలారం ఉన్నప్పటికీ పనిచేయలేకపోవడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు చుట్టపక్కల ఉన్న సిసి కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి వారి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఎటిఎంలో భారీ చోరీ జరిగిన విషయాన్ని పోలీస్ అధికారులు, బ్యాంకు అధికారులకు సమాచారం అందించడంతో బ్యాక్ అధికారులు పరిశీలించి స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. సిఐ ఆధ్వర్యంలో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News