మళ్లీ సిఇఒగా సామ్ ఆల్ట్‌మన్ రాక
న్యూయార్క్ : చాట్ జిపిటి సృష్టికర్త, ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్ ఆకస్మిక తొలగింపు కథ అనేక మలుపులు తిరుగుతోంది. అయితే ఇప్పుడు కంపెనీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. సామ్ ఆల్ట్‌మన్ మళ్లీ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా మళ్లీ ఓపెన్ ఎఐకి వస్తారని కంపెనీ బోర్డు ప్రకటించింది. ఈ సమాచారాన్ని కంపెనీ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పేర్కొంది. సామ్ తిరిగి వస్తాడని కంపెనీ పోస్ట్ చేసింది. మళ్లీ సామ్ సిఇఒగా నియమించేందుకు కంపెనీ కొత్త బోర్డు సభ్యులతో ప్రాథమిక ఆమోదం లభించిందని కంపెనీ ఎక్స్‌లో వెల్లడించింది.
వాస్తవానికి సామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఒగా తొలగించిన తర్వాత కంపెనీలో 500 మందికి పైగా ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాదు కంపెనీ బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయకపోతే, మేమంతా రాజీనామా చేస్తామని కంపెనీని ఉద్యోగులు బెదిరించారు. మైక్రోసాఫ్ట్‌లోని కొత్త విభాగంలో తమ మాజీ బాస్ సామ్ ఆల్ట్‌మన్‌తో చేరతారని కంపెనీ ఉద్యోగులు ఒక లేఖలో తెలిపారు. ఈ ముప్పు కారణంగా ఓపెన్ ఎఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చిందని, సామ్ ఆల్ట్‌మన్‌ను రీకాల్ చేయాల్సి వచ్చిందని భావిస్తున్నారు. అయితే ఎలోన్ మస్క్ ఈ మొత్తం మ్యాటర్‌ను పబ్లిసిటీ స్టంట్‌గా పేర్కొన్నారు.
అసలు విషయమేమిటి?
నవంబర్ 17న ఓపెన్ ఎఐ బోర్డు సభ్యులు కంపెనీ ఎఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఒ పదవి నుండి తొలగించారు. మరుసటి రోజు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరగా, దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అయితే ఓపెన్ ఎఐలో సిబ్బంది కొత్త సిఇఒకి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. మూడు రోజుల్లో ఓపెన్ ఎఐలో ముగ్గురు సిఇఒల మార్పు, నియామకం గురించి కూడా చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో సామ్ కంపెనీకి తిరిగి రాబోతున్నట్లు ఓపెన్ ఎఐ కంపెనీయే ప్రకటించింది.