Monday, December 23, 2024

వివాహంలో భారీ ఎత్తున కుంభకోణం

- Advertisement -
- Advertisement -

బాలియా : ఉత్తర ప్రదేశ్‌లో వివాహం పేరిటభారీ ఎత్తున సాగిన వంచనకు సంబంధించి ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక భారీ వివాహ వేడుకలో వరులు తమకు తామే వరమాల వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత కుంభకోణం బయల్పడింది. వరులుగా దుస్తులు వేసుకున్న కొందరు పురుషులు తమ ముఖాలను కప్పుకోవడం ఆ వీడియోలో కనిపించింది. ఉత్తర ప్రదేశ్ బాలియా జిల్లాలో జనవరి 25న ఆ వివాహ వేడుక జరిగింది. దాదాపు 568 జంటలు ఆ కార్యక్రమంలో పెళ్లి చేసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, వధూవరులుగా నటించేందుకు పలువురికి డబ్బులు చెల్లించినట్లు ఆ తరువాత వెల్లడైంది. వధూవరులుగా నటించేందుకు మహిళలు, పురుషులకు రూ. 500, రూ. 2000 మధ్య చెల్లింపులు జరిగాయని స్థానికుడు ఒకరు ఆరోపించారు. ‘కొందరు మహిళలకు వరులు లేరు. వారు స్వయంగా వరమాల వేసుకున్నారు.

జనానికి రూ. 500, రూ. 2000 మధ్యచెల్లించినట్లు మాకు తెలియవచ్చింది’ అని విమల్ కుమార్ పాఠక్ చెప్పారు. వరునిగా నటించేందుకు తనకు డబ్బు ఆఫర్ చేశారని 19 ఏళ్ల యువకుడు ఒకరు ఒక ఆంగ్ల టివి చానెల్‌తో చెప్పారు. ‘పెళ్లి చూసేందుకు నేను అక్కడికి వెళ్లాను. నేను అక్కడ కూర్చునేలా వారు చేశారు. నాకు డబ్బు ఇస్తామని వారు చెప్పారు. చాలా మందిని అలా కూర్చునేలా చేశారు’ అని ఆ యువకుడు రాజ్ కుమార్ తెలిపారు. ఆ సామూహిక వివాహ కార్యక్రమానికి బిజెపి ఎంఎల్‌ఎ కేతకీ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదరు మోసంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం గురించిన ప్రశ్నించగా ‘కార్యక్రమానికి సరిగ్గా రెండు రోజుల ముందు నాకు సమాచారం ఇచ్చారు. ఏదో గూడుపుఠాణి జరుగుతోందని అనుమానించాను. అయితే, ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతోంది’ అని కేతకీ సింగ్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, ఆ పథకం కింద ప్రభుత్వం రూ. 51 వేలు సమకూరుస్తుంది.

దానిలో రూ. 35 వేలు బాలికకు ఇస్తుండగా, రూ. 10 వేలు పెళ్లి వస్తువులు కొనుగోలుకు, రూ. 6000 కార్యక్రమానికి వెచ్చిస్తున్నారు. కాగా, నిందితులకు డబ్బు బదలాయింపు జరగడానికి ముందే ఆ కుంభకోణం వెల్లడైందని అధికారులు తెలిపారు. ‘ఆ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు, లబ్ధిదారులు అందరినీ నిర్ధారించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని వెంటనే వేశాం. దర్యాప్తు ముగిసేంత వరకు డబ్బు బదలీ జరగదు’ అని అధికారులు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News