హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచు ఉత్కంఠభరితంగా సాగుతూ.. ఫ్యాన్స్‌కి పూర్తి ఆనందాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బిసిసిఐ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఐపిఎల్ సీజన్ మధ్యలో ఫిక్సింగ్ మహమ్మారి ప్రవేశించే అవకాశం ఉందని బిసిసిఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నాడని.. దీనిపై అన్ని ఫ్రాంచైజీలను బిసిసిఐ అప్రమత్తం చేసింది. ఈ వ్యాపారవేత్త టీం ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లు ఇలా అన్ని విభాగాల్లో పని చేసే వాళ్లని టార్గెట్ చేసి.. అవినీతిలోకి ప్రలోభ పెట్టే అవకాశం ఉందని బిసిసిఐ యాంటీ-కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్(ఎసిఎస్‌యు) గుర్తించింది.
ఈ వ్యాపారవేత్తకు బుకీలు, బెట్టింగ్ సిండికేట్‌లతో సంబంధాలు ఉన్నాయని.. గతంలో అతను అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఎసిఎస్‌యు వెల్డండించి. తాను కూడా ఓ సాధారణ అభిమానిగా చిత్రీకరిస్తూ.. ఖరీదైన బహుమతులు, ఆఖరణాలు, ఆటగాళ్లను, కోచ్‌లను, సిబ్బందిని లగ్జరీ కార్లు ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆశ్చర్యకంగా ఆటగాళ్ల కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా అనుమానస్పదంగా ఉంటే తమకు వెంటనే సమాచారం అందించాలని ఎసిఎస్‌యు తెలిపింది. ప్రస్తుతానికి ఆ బడా వ్యాపారవేత్త పేరును గోప్యంగా ఉంచింది.