సామాన్య మదుపరులు నష్టపోతున్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ఆప్తమిత్రులైన పెట్టుబడిదారుల పరిరక్షణకు ‘ఫిక్స్‌డ్ మ్యాచ్’ సాగుతోందని, సామాన్య మదుపరులు భారీగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. ‘బుచ్ స్టాప్స్ హియర్’ (బుచ్ ఇక్కడ ఆగుతారు) శీర్షికతో విడుదల చేసిన వీడియోలో సెబీ చీఫ్ మాధబి పురి బుచ్‌ను, వాణిజ్యవేత్త గౌతమ్ అదానీని రాహుల్ లక్షం చేసుకున్నారు. తన సహచరుడు, పార్టీ నేత పవన్ ఖేరా, వెటరన్ జర్నలిస్ట్ సుచేతా దలాల్‌తో మదుపరుల పొదుపు మొత్తాలను కాపాడే అంశంపై చర్చిస్తూ రాహుల్ వారిద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
చైర్‌పర్సన్ బుచ్ ఆధ్వర్యంలో సెబీ మదుపరుల సంపదను కాపాడడంలో విఫలమైందని, అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ దిగ్గజాలను అది ‘పరిరక్షించింది’ అని రాహుల్ ఎనిమిది నిమిషాల వీడియో సంభాషణలో ఆరోపించారు. ‘మీ పెట్టుబడులు సురక్షితమేనా? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ నష్టపోతుంటారు, సామాన్య మదుపరి మరింతగా నష్టపోతుంటాడు’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో వీడియోను పంచుకుంటూ ఆరోపించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ సెబీ చీఫ్ బుచ్‌పై తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం విదితమే. ఆమె కొన్ని అదానీ సంబంధిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని రాహుల్ అంతకు ముందు ఆరోపించారు. అయితే, తనపై ఆరోపణలను బుచ్ ఖండించారు. ఆరోపణల నేపథ్యంలో సెబీ చీఫ్ రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ కోరుతోంది.