భారత్‌కు సవాల్ వంటిదే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో పాటు న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఆదివారం దుబాయి వేదికగా తుది పోరు జరుగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, కివీస్‌లు అసాధారణ ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చాయి. సెమీ ఫైనల్లో భారత్ పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి ముందంజ వేసింది. న్యూజిలాండ్ సెమీస్ పోరులో బలమైన సౌతాఫ్రికాను ఓడించింది. రెండు జట్లు కూడా నిలకడైన ఆటతో తుది పోరుకు అర్హత సాధించాయి. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ అద్భుత ఆటతో అలరిస్తోంది. భారత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతేగాక సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో జరిగిన సిరీస్‌లలో కూడా జయభేరి మోగించింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. ఈ పరిస్థితుల్లో ఫైనల్లో భారత్‌కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. లీగ్ దశలో కివీస్‌ను ఓడించినా ఫైనల్లో మాత్రం అలాంటి ఫలితం సాధించడం టీమిండియాకు అంత తేలికేం కాదనే చెప్పాలి. ఐసిసి టోర్నమెంట్‌లలో కివీస్‌కు మంచి రికార్డే ఉంది. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా కివీస్‌కు ఉందనే విషయాన్ని మరువ కూడదు. భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా ఫైనల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు న్యూజిలాండ్ టీమ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు ఫామ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో రచిన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కూడా జోరుమీదున్నాడు. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాజాగా సఫారీతో జరిగిన సెమీస్‌లో సెంచరీతో అలరించాడు. ఈ పరిస్థితుల్లో ఫైనల్లో రచిన్, విలియమ్సన్, యంగ్‌లతో భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అంతేగాక గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, సాంట్నర్, బ్రేస్‌వెల్, మిఛెల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఫైనల్లో భారత్‌కు గట్టి పోటీ ఖాయమనే చెప్పాలి.
కివీస్‌తో ఫైనల్ తేలికేం కాదు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -