Friday, November 22, 2024

భౌతికవాదం- భగవద్భావం

- Advertisement -
- Advertisement -

వైద్యుల్లో అత్యధికులు ఆధ్యాత్మికులే. రోగనిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్సలకు ముందు ఇష్ట దైవా న్ని ప్రార్థించవచ్చు. కాని మీ దేవున్ని నమ్ముకొమ్మని, ఆయనే మిమ్మలను రక్షిస్తాడని చెప్పరు. అలా చెపితే వృత్తికి నష్టం కలగవచ్చు. కాని భావాల్లో భగవద్భావం ఉన్నా వైద్యులు ఆచరణలో భౌతికవాదులు. మన పుట్టుక, జీవితం, రోగాలు, చావు దైవ సృష్టి. వాటిని కొనసాగించాలా, కడతేర్చాలా అన్నది భగవదేచ్ఛ అన్న ప్రవచనాలు రోజూ మనకు రోడ్ల మీద కూడా వినపడతాయి. రాజ్యం కోసం బంధు మిత్రులను చంపమని అర్జునునికి ఆ భగవానుడే చెప్పాడు.

అధినాయకుని ఆజ్ఞ ముందు అర్జునుని తర్కం పని చేయలేదు. కృష్ణార్జునుల మధ్య ఈ తర్కమే లేకపోతే భగవద్గీతే లేదని భారతీయ తత్వశాస్త్రవేత్త, ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ రాశారు. పతనమవుతున్న హిందుత్వాన్ని పరిరక్షించడానికి ముగ్గురు వైదికవాదులు వేదవ్యాసుని భూత రచయితలుగా భగవద్గీతను రాశారు. ఒకరు ఆనాటికి అభివృద్ధిలోనున్న బౌద్ధ, జైనాల వినాశనానికి రచన చేశారు. ఇంకొకరు హైందవ కుల వ్యవస్థ స్థిరీకరణకు కృషి చేశారు. మరొకరు ఆత్మపరమాత్మ, ధర్మాధర్మాలు, పూర్వజన్మ సంచితకర్మ ఫలితాలుగా పుణ్య పాప, స్వర్గ నరకాలు మొదలగు వివరాలతో వైదిక వాదాన్ని సజీవ పరిచారు. ఆధ్యాత్మిక భావాలను జన్మతః కుటుంబ పెద్దల సనాతన ఆచార ఆచరణల ఆధారంగా అందిపుచ్చుకొని అధిక సంఖ్యాక వైద్యులు సనాతన భావాలను అనుసరిస్తున్నారు.

కాని వారు వృత్తి నిర్వహణలో, రోగ నిర్ధారణ చికిత్సల్లో వైద్య శాస్త్ర విజ్ఞానంపై విశ్వాసంతో, భౌతికవాదంతో జీవిస్తున్నారు. వైద్యుల ఆధ్యాత్మికత ఆచరణ రూపం దాల్చితే, భౌతిక ఆచరణలనువారి సనాతన భావజాలం అధిగమిస్తే మనుషులు, పశుపక్ష్యాదులు వ్యాధులతో క్షీణించేవారు. పునరుత్పత్తి ప్రక్రియలు పతనమయ్యేవి. సామాజిక ఉత్పత్తి తగ్గేది. జీవుల ఉనికి ప్రమాదంలో పడేది. భారతీయ సమాజంలో సనాతన ఆధిపత్యవాదులయిన అగ్రవర్ణస్తులు 2,500 ఏళ్ల నాడే విశేషాధరణ పొందిన ఆయుర్వేద వైద్యాన్ని నాశనం చేశారు. సృష్టివాదంతో, అతి శూద్ర కులాల అంటరానితనంతో అడ్డుకున్నారు. మనుషులతో సహా సమస్త జీవరాశి దైవ సృష్టి.

దాని నిర్వహణ, నిర్వాణ నిర్యాణాలు అంటే మనుషుల పుట్టుక, జీవనం, మరణం, ముక్తి మోక్షాలు దైవ నిర్ణయాలు. రోగాలు, రోగ తీవ్రత వాటిలో భాగం. రోగ నిరోధం, చికిత్స, దైవనిర్ణయమైన మనిషి ఆయుషు పెంచడం దైవాజ్ఞ ధిక్కారాలు, పాపాలు, నేరాలు. అంతేగాక వైద్యులు వైద్యంలో అంటరాని వారయిన శూద్రులను, అతి శూద్రులను పట్టుకొని అదే చేతులతో అగ్రవర్ణస్తులనూ తాకి సమాజాన్ని మలిన పరుస్తారు. ఈ మలిన శుద్ధీకరణ ప్రక్రియల్లో బోలెడు డబ్బు, సమయం వృథా అవుతున్నాయి. ఈ వాదనలతో అగ్ర కులస్థులు ఆయుర్వేద వైద్యాన్ని అడ్డుకున్నారు. వైద్యులపై దాడి చేశారు. వినని వైద్యులను చంపారు. ఆయుర్వేద వైద్యులు భయపడి వైద్యాన్ని ఆపేశారు.

ఆయుర్వేదం అంతరించింది. నేటి సనాతనవాద పాలకులు మరలా ఆయుర్వేదాన్ని, వైద్య సామర్థ్యంతో సంబంధం లేకుండా సనాతనవాద వర్ణస్తులను ప్రోత్సహిస్తున్నారు.వీరి రుసుములు, చికిత్సలు, ఔషధాలు సామాన్యులకు అందనంత ఖరీదుగా ఉంటాయి. ఆ విధంగా పాత వైద్యంతో కొత్త వైద్య దోపిడీ ఆరంభమయింది. ఆధునిక ఆలోచనల, ప్రగతిశీల భావాల ప్రచారకుల, కొందరు వామపక్షీయుల, కమ్యూనిస్టుల, మార్క్సిస్టుల అధ్యయన రాహిత్యం, భావజాల వక్రీకరణ, అనిబద్ధ్దత, సమర్థనావాదం పెరిగాయి. వ్యక్తిగత ఆచరణలేమి వ్యత్యాసాలను సిద్ధాంత విభేదాలుగా వక్రీకరించి సమానాంతర రూపాంతర మార్క్సిజాన్ని ప్రచారం చేశారు.

తమ వర్గ శత్రువుల కంటే కమ్యూనిస్టు దాయాదులను ప్రధాన శత్రువులుగా చిత్రీకరించారు. పరస్పర మానసిక, శారీరక హింసలకు పాల్పడ్డారు. తమ అనుచరులకు దాయాది పక్ష నాయకుల, సభ్యుల అల్ప లోపాలను అతిశయీకరించారు. వారి కొండంత మంచిని, మానవత్వాన్ని, అత్యుత్తమ వ్యక్తిత్వాలను, సమాజ శ్రేయోశీలతలను, మార్క్సిస్టు నిబద్ధతను ప్రస్తావించనే లేదు. దీనితో తమ సభ్యులలోనే గాక, సాధారణ ప్రజానీకంలో కూడా గందరగోళం తయారయింది. కష్ట కాలాల్లో కమ్యూనిస్టులను ఆశ్రయించే ప్రజలు మొత్తం కమ్యూనిస్టులనే ఎన్నికలలో తిరస్కరించారు.

మన ఆశయ మాత్ర మార్క్సిస్టులు నిజసతులను నిజీకరిస్తారు. సొంత ఆస్తిగా వంటింట్లో కట్టేస్తారు. ఉద్యోగాలతో, ఆర్థిక స్వతంత్రతతో కుటుంబానికి సాయపడే వాళ్ళయినా అనుత్పాదిత ఇంటి చాకిరీని ఆడవాళ్ళకే అప్పజెపుతారు. బయట సిద్ధాంత ప్రవక్తలు వీరే. ఇలా సంప్రదాయ భావాల్లో బంధించబడ్డ స్త్రీలు కుటుంబ సభ్యులు వైదిక వాదాన్ని వంటబట్టించుకుంటారు. పిల్లలను ఆభావజాలంతోనే పెంచుతారు. ఇంటికి వచ్చిన వారికి నమస్కారం పెట్టడం నేర్పరు. కేలండర్లలో దేవుని బొమ్మలకు దండం పెట్టడం అలవాటు చేస్తారు.ఈ కమ్యూనిస్టు ప్రవక్తలు పిల్లలకు తమ కుల, మతాలను సూచించే లేదా దేవతల పేర్లను పెడతారు. ప్రత్యామ్నాయ కార్యకలాపాలు లేని వారి కుటుంబ సభ్యులు పూజలకు, గుళ్ళ దర్శనాలకు, టివి సీరియళ్ళకు అలవాటు పడతారు.

పైగా భార్యల భావ స్వేచ్ఛను ఆమోదించాలి కదా అని ఈ సిద్ధాంతవాద ప్రచారకులు కుంటి సాకులు చెపుతారు. సతీ సంతాన కుటుంబ సభ్యుల భక్తి ప్రపత్తులను, ఆధ్యాత్మిక ఆలోచనలను నిశ్శబ్దంగా ఆమోదిస్తారు. ఇంటిలో గెలవకుండా వీధిలో గెలవగలమా? స్వీయ కుటుంబానికి నచ్చజెప్పలేని సిద్ధాంతాన్ని ప్రజలకు ఎక్కించగలమా?అందుకే చాలా మంది కరుడుగట్టిన కమ్యూనిస్టు యోధుల అంత్యక్రియలు, మరణానంతర ఆచారాలు తమ సనాతన మతాచారాల ప్రకారం జరుపుతారు. ఈ పనులునిబద్ధ మార్క్సిస్టుల గౌరవాన్ని తగ్గిస్తాయి. ప్రశ్నిస్తాయి.

కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ప్రపంచీకరణ ప్రక్రియల్లో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు పెరిగాయి. విద్య, వైద్యం వంటి ప్రజావసర సేవలను ఆక్రమించాయి. నేటి భారతంలో పాలక వర్గం, పారిశ్రామిక యాజమాన్య వర్గం, మతం కలిసి దేశాన్ని దోచుకుంటున్నాయి. గుళ్ళ నిర్మాణంతో, భక్తి భావంతో, మనోభావాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. తమ దోపిడీ, ఆధిపత్య చర్యలకు అడ్డుతగులుతున్నారని పాలకులు, కార్పొరేట్ సంస్థలు మూలవాసులయిన అటవీ వాసులను తీవ్రవాదులుగా వక్రీకరించారు. సాధారణ ప్రజ లు, వైద్యులు దేవుని నమ్మినా ఆచరణ భౌతికవాదులు. పాలక వర్గంతో సహా ఆశయవాద భౌతికవాద ప్రవక్తలు అవసరార్థ వక్రీకరణల ఆచరణవాద భావవాదులు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News