Thursday, January 23, 2025

ప్రసూతి సేవలు భేష్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రీ చైల్ ఎ హెల్థీ స్టార్ట్’ హాష్ ట్యాగ్ తో హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి, యునిసెఫ్ ట్వీట్ చేసింది.

ఆరోగ్యతెలంగాణ అభివృద్ధికి సూచిక : హరీశ్‌రావు

ప్రసూతి సంరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించినందున సంతోషంగా ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిశీల నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్‌లో శుక్రవారం ఓ పోస్టు చేసింది. హైదరాబాద్లోని ఓ ఏరియా ఆస్పత్రిలో మిడ్ వైఫరీ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్ పోస్టులో జత చేసింది. తెలంగాణలో మాతాశిశు సంరక్షణ భేషుగాఉందని యునిసెఫ్ పేర్కొన్నది. మిడ్ వైఫరీలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచినట్లు యునిసెఫ్ తన ట్వీట్‌లో వెల్లడించింది. మెటర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ సర్కార్ గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పిరియన్స్ కలిగే రీతిలో మిడ్ వైఫరీ శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది.

ఈ విధానం అద్భుతంగా ఉందని ఇటీవలే కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలశాఖ నర్సింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బాలచంద్రన్ పేర్కొన్న విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణను ఫెర్నాండేజ్ ఫౌండేషన్, యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ ఏరియా దవాఖానతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు దవాఖానల్లో నిర్వహిస్తున్నది. గజ్వేల్ పట్టణంలోని ఏరియా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా స్టాఫ్ నర్సులకు నిర్వహిస్తున్నఈ శిక్షణ విధానాన్ని ఆమె పర్యవేక్షించారు. మిడ్ వైఫరీ శిక్షణలో గర్భిణులు సాధారణ ప్రసవాలు జరుగడానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, సాధారణ ప్రసవాల వల్ల లాభాలు, గర్భిణికి సాధారణ ప్రసవాలపై విశ్వాసం కలిగేలా ఏ విధంగా చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News