అభూత కల్పనలకు అలవాటుపడ్డ జనం వాస్తవాల్ని వాస్తవాలుగా స్వీకరించరు. సహజత్వాన్ని సహజత్వంగా అంగీకరించరు. అందులో కూడా వారికేవో అనుమానాలు, భయాలు తలెత్తుతూ ఉంటాయి. మంత్రాలేస్తారనో, చేతబడి చేస్తారనో కొందరిని కొట్టి చంపడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసి కూడా మంత్ర కళలున్నాయంటే జనం భయపడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఇది ఇప్పటి పరిస్థితే కాదు, వందల యేళ్ల నుండి ఈ ధోరణి సమాజంలో ఉంది. ఉదాహరణకు ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనో (1548 1600) విషయం చూద్దాం. ఆయన బుద్ధికుశలతని, మేధాశక్తిని మతఛాందసవాదులు భరించలేకపోయారు. ఆయనలో సైతాను ప్రవేశించిందని రక్తం చిమ్మకుండా సజీవంగా నిప్పంటించి కాల్చారు.
బ్రూనో తండ్రి జియోవన్ని బ్రూనో ఒక సైనికుడు. ఆయన తన కొడుకును విద్యా భ్యాసంకోసం నాప్లస్‌కు పంపాడు. అక్కడ ఆగస్టియన్ మొనస్ట్రీ (సన్యాసుల ఆశ్రమం)లో ఉంటూ బ్రూనో ప్రైవేటుగా విద్యనభ్యసించేవాడు. అక్కడికి దగ్గరలో ఉన్న స్టేడియంలో అప్పుడప్పుడు సాగే ఉపన్యాస కార్యక్రమాలకు వెళుతుండేవాడు. మొనస్ట్రీలో ఈయనకు గియార్డనో క్రిస్‌పో అనే ట్యూటర్ మెటాఫిజిక్స్ బోధిస్తుండేవాడు. ఆ ట్యూటర్ ప్రభావంలో బ్రూనో ఎంతగా పడిపోయాడంటే, తన పేరులోని ‘ఫిలిప్పో’ను వదిలేసి ‘గియార్డనో’ పేరు తగిలించుకున్నాడు. అక్కడ పదిహేడో యేట మొనస్ట్రీలో డొమినికన్ ఆర్డర్‌లో ప్రవేశించాడు. అంటే ప్రభు విశ్వాసకుల్లో ఒకడిగా గుర్తింపు వచ్చిందన్నమాట! శిక్షణ పూర్తి చేసుకుని 1572 నాటికి అంటే తన ఇరవై నాలుగవ యేట మత బోధకుడి (ప్రీస్ట్)గా అయ్యాడు. అప్పటికే అతని అమోఘమైన జ్ఞాపకశక్తి, గణితం మీద పట్టు అందరూ గుర్తించసాగారు. ఓసారి రోమ్ నగరానికి వెళ్లి ఏదో పోస్ పయస్, అలాగే కార్డినల్ రిబిబాల ముందు తన ప్రజ్ఞాపాటవాల్ని ప్రదర్శించి వచ్చాడు. “ఆన్ ద ఆర్క్ ఆఫ్ నోహ్” అనే తన సూత్రీకరణల్ని మత పెద్దలు అంగీకరించారని చెప్పుకున్నాడు.
1576 1592 మధ్య కాలంలో పుస్తకాలు రాస్తూ, కొంత కాలం ఉపన్యాసకుడిగా పని చేస్తూ, దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. బ్రూనో ఖగోళ సిద్ధాంత కర్త మాత్రమే కాక, కవి, తత్వవేత్త కూడా కాబట్టి అనేకానేక, విభిన్నమైన రచనలు చేశాడు. వెన్నిస్‌లో ఉన్నప్పుడు ‘కాలపు చిహ్నాలు’ ప్రచురించాడు. యూనివర్శిటీ ఆఫ్ జెనీవాలో కొంత కాలం, ఫ్రాన్స్‌లోని పారిస్‌లో కొంత కాలం గడిపాడు. ఫ్రాన్స్ లయాన్‌లో ఉన్నప్పుడు డాక్టరేట్ తీసుకున్నాడు. ఆయన ఉపన్యాసాలకు ఆకర్షితులైన విద్యార్థులు ఆయనే తమకు అధ్యాపకుడిగా కావాలన్నారు. పారిస్‌లో ఓ ముప్పయి ఉపన్యాసాలిచ్చాడు. వాటి వల్ల గొప్ప కీర్తి గడించాడు. ఆయన ఉపన్యాసాలన్నీ క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల, ఆయన వృత్తి రీత్యా మత బోధకుడన్న విషయం మరుగునపడింది.
బ్రూనో పేరు ప్రఖ్యాతుల గూర్చి తెలుసుకున్న రాజు మూడవ హెన్రీ ఒకసారి బ్రూనోను పిలిపించుకుని “నీ తెలివితేటలు సహజమైనవా లేక ఏవైనా మంత్రకళల వల్ల అబ్బినవా?” అని ప్రశ్నించాడు. అందుకు బ్రూనో “తనకు మంత్ర కళలేవీ తెలియవని, తనది సహజమైన మేధస్సేనని” విన్నవించుకున్నాడు. అంతేకాదు, “ఆలోచన ఛాయలు” (1582) పేరుతో పుస్తకం రాసి ఆయనకు అంకితమిచ్చాడు. రాజు మూడవ హెన్రీ సంతోషించి వెంటనే ఉపన్యాసకుడిగా నియమించి, మంచి జీతం ఏర్పాటు చేశాడు. వైజ్ఞానికుడు, తత్వవేత్త, కవి అయిన బ్రూనో ఉపన్యాసకుడిగానే కాదు, రచయితగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఆ కాలంలోనే ‘జ్ఞాపక కళ’ (1582), ‘వృత్త గీతం’ (1582) వంటి సాహిత్య గ్రంథాలు ప్రకటించాడు.
ముఖ్యంగా అవి అనుభవాలకు, జ్ఞాపకాలకు సంబంధించినవి. అదే సంవత్సరం ప్రకటించిన ‘దివిటీ ధారుడు’ హాస్యరస ప్రధానమైన తాత్విక గ్రంథం. ఆ మరుసటి సంవత్సరం రాజు మూడవ హెన్రీ సిఫారసుతో బ్రూనో ఇంగ్లాండు చేరాడు. అక్కడ కవులు ఫిలిఫ్ సిడ్నీ, జాన్. డి వంటి వారి స్నేహం లభించింది. ఆక్స్‌ఫర్డ్‌లో ఉపన్యసించే అవకాశమూ లభించింది. అక్కడ ఒక సంవత్సర కాలంలోనే నాలుగు పుస్తకాలు ప్రచురించ గలిగాడు. అంటే ఆయన మేధో సంపద, రచనా కౌశలంఎంత గొప్పదో బేరీజు వేసుకోవచ్చు. “ఇటాలిన్ డైలాగ్స్” “కారణం: సూత్రీకరణల ఐక్యత” “అనంత విశ్వం: ప్రపంచాలు” వంటివన్నీ వెంట వెంట ప్రచురించాడు. అయితే “ద ఏష్ వెన్స్ డే సప్పర్ (THE ASH WEDNESDAY SUPPER) మాత్రం చాలా వివాదాస్పదమైంది. విషయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం వల్ల కొందరు మిత్రులే నొచ్చుకుని ఆయనకు దూరమయ్యారు.
క్యాథలిక్ కుట్రదారుల కుట్రల్ని క్వీన్ ఎలిజబెత్ సెక్రటరీకి ‘హెన్రీ షాగెట్’ అనే మారుపేరుతో చేరవేస్తుండేవాడు. అక్టోబర్ 1585 లో లండన్‌లోని ఫ్రెంచ్ రాయబారి కార్యాలయంపై కొందరు దాడి చేశారు. అందులోనే ఉన్న బ్రూనో, ఇక అక్కడ ఉండడం క్షేమకరం కాదని, ఉద్రిక్తమైన రాజకీయ పరిణామాల వల్ల పారిస్‌కు వెళ్లిపోయాడు. తర్వాత జర్మనీకి చేరుకున్నాడు. జర్మనీలో అనుకున్నంతగా మంచి బోధనావకాశాలు రాలేదు గాని, విట్టెన్‌బర్గ్‌లో చిన్న అవకాశం లభించింది. అక్కడ రెండేళ్లు అరిస్టాటిల్ కృషి గురించి బోధించాడు. ప్రాగ్‌లోనూ, ఫ్రాంక్ ఫర్ట్‌లోనూ గడిపాడు. ఆ కాలంలో లాటిన్ పుస్తకాలు వెలువరించాడు. అయితే బ్రూనో నేరుగా లాటిన్‌లో రాయలేదు. ఆయన చెపుతుండగా బిసిలర్ అనే అతను లాటిన్‌లోకి అనువదిస్తూ రాసేవాడు.
అలా బ్రూనో ఏ దేశంలోనూ ఉండిపోతే బావుండేది. తిరిగి మళ్లీ ఇటలీకి వెళ్లడం పెద్ద పొరపాటు అయిపోయింది. మతం మత్తులో జోగుతున్న అక్కడ వారికి బ్రూనో అభిప్రాయాలు నచ్చేవి కావు. పాడువాలో కొన్ని నెలల బోధన తర్వాత, వెన్నిస్‌లో హౌస్ ట్యూటర్‌గా చేరాడు. అక్కడ దాని నిర్వాహకుడు బ్రూనో దైవ వ్యతిరేకి అని గ్రహించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దైవదూషణ కారణం కింది వారు 22 మే 1592న బ్రూనోను అరెస్టు చేసి, రోమ్‌కు పంపారు. అప్పటి నుండి రోమ్‌లో మత న్యాయస్థాన అధికారుల ఆగడాలు ప్రారంభమయ్యాయి. సహజమైన మేధాశక్తి మంత్ర కళల వల్ల వచ్చిందని అనుమానపడడం.. ఆయన చెప్పే వైజ్ఞానిక అంశాల గూర్చి ఆలోచించకుండా, ఆయనలో సైతాను ప్రవేశించిందని ఆ సైతానే క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వుందని.. భావించడం ఎంతో విచారించవల్సిన విషయం! ఆ విధంగా ఆయనను సజీవంగా దహనం చేయడం మత కిరాతకుల దారుణ చర్య! వైజ్ఞానిక మేధస్సు ముందు మతం తలదించుకోవాల్సిన పరిస్థితి. వందల యేళ్లు గడిచినా ఇప్పటికీ మతాలు అదే మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నాయి. పునరుద్ధరణ ప్రసక్తే లేదు.
బ్రూనో వ్యక్తిత్వ ప్రభావం, ఆయన వైజ్ఞానిక సిద్ధాంతాల ప్రభావం కవులు, రచయితలు, కళాకారులపై విపరీతంగా పడింది. ఆయన సమకాలికులు, ఆయన తర్వాతి తరం వారూ ఆయన త్యాగాన్ని, గొప్పదనాన్ని అక్షరబద్ధం చేస్తూ వచ్చారు. బ్రూనో సజీవ దహనాన్ని నిరసిస్తూ ‘స్విన్ బర్న్, క్రిస్‌లా మిలోజ్, మాక్ హ్యూగ్ మొదలైన కవులంతా గాఢమైన కవిత్వం రాసి ప్రపంచ పాఠకులకు అందించారు. జేమ్స్ జాయ్, బెర్తెల్డ్ బ్రెహ్ట్; ఎస్.జె. పారిస్; మెర్రిస్ వెస్ట్ మొదలైన వారి రచనల్లో బ్రూనో స్ఫూర్తి కనిపిస్తుంది. “కాస్ మోస్, ఎ స్పేస్ టైం ఒడిస్సీ” (2014) అనే టెలివిజన్ సీరియల్‌లో బ్రూనో పాత్ర చిత్రితమై ఉంది. అలాగే సినిమాలు కూడా వచ్చాయి. బ్రూనో ప్రతిపాదించిన ఖగోళ సిద్ధాంతాలు వృథా కాలేదు. ఆయన ఏ సత్యస్థాపన కోసం త్యాగం చేశాడో, ఆ త్యాగాన్ని ప్రపంచ మానవాళి తమ గుండెల్లో భద్రపరుచుకుంది.
బ్రూనో మరణం తర్వాత 270 సంవత్సరాలకు ఇటలీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క్రైస్తవ మతాధికారుల పెత్తనం చాలా వరకు అంతరించింది. కొత్త ఇటలీ రాజ్యం ఏర్పడింది. బ్రూనో ఎక్కడ సజీవంగా దహనం చేయబడ్డాడో అక్కడే కాంపో డి ఫియోరి కూడలిలో 1889 లో రోమ్ మున్సిపాలిటీ బ్రూనో నిలువెత్తు విగ్రహం ప్రతిష్టాపించింది. ఆ తర్వాత మళ్లీ 119 సంవత్సరాలకు అంటే 2008 లో బెర్లిన్‌లోని పాట్స్ డామర్ ప్లాట్స్ స్టేషన్‌లో తలకిందులుగా కాలిపోయిన బ్రూనో విగ్రహం ప్రతిష్టించారు. తరువాత తరం ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఆయనను గౌరవించుకున్నారు. అంతరిక్షంలో చంద్రునికి ఇరవై రెండు కి.మీ దూరంలో ఉన్న ఒక ఖగోళ పదార్థాన్ని (ఇంపాక్ట్ క్రాటర్) కి ‘గియార్డనో బ్రూనో’ గా నామకరణం చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక రేడియో ప్రసార కేంద్రానికి ఆయన జ్ఞాపకార్థం కాల్ సిగ్నల్‌కు 2జిబి అనే పేరు పెట్టుకున్నారు. జి.బి అనేవి బ్రూనో పేరుకు సంక్షిప్తం. 1995లో బ్రూనో స్మారక అవార్డు స్థాపించబడింది. 2004 లో ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటయింది.
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు, ఒక క్రైస్తవ సన్యాసే క్రైస్తవం మీద ధ్వజమెత్తాడు. మతమౌఢ్యం తనను సజీవంగా అగ్నికి అర్పించబోతోందని తెలిసి కూడా బ్రూనో దాసోహమనలేదు. రాజీపడ లేదు. నిర్భయంగా ఎదుర్కొని అమరుడయ్యాడు. సైన్స్‌తో పాటు సైన్స్ చరిత్ర కూడా తెలుసుకోవడం అవసరం. వ్యక్తిత్వ వికాసానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రచారాలతో మహానుభావులవుతున్నవారు ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది.
డాక్టర్ దేవరాజు మహారాజు