ఈ విశాల విశ్వం అంతటా అన్ని గణితీయంగానే సంభవిస్తాయి అని లైబినిడ్జ్ అనే గణిత శాస్త్రజ్ఞుడు అంటాడు… మానవుడు పసిబిడ్డగా ఈ భూమిపైకి వచ్చిన నాటి నుండి మరణం వరకు ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో, గణితాన్ని ఉపయోగిస్తాడు. అందువలన గణితం మానవ జీవితంతో అవినాభావ సంబంధంకలిగి ఉంది. ఆటాడుకునే పిల్లవాని నుండి అంతరిక్ష యాత్రికునివరకు గణితాన్ని ఉపయోగించకుండా ఉండలేరు. అసలు గణితం ఉపయోగించకుండా ఒక్క క్షణం కూడా ముందుకు సాగలేమంటే అతిశయోక్తి కాదేమో. గణితం అంతగా మానవ జీవితంతో పెనవేసుకుంది. అలాగే మానవ నాగరికతతోపాటు గణితం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అందువలనే మానవ మనుగడకు గణితం అద్దం లాంటిది అని పేర్కొనడం జరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగినందు వలన గణితం ఆవశ్యకతను నేటి తరం నుండి ముందు తరాల వారికి వ్యాప్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి. ఆ కారణంగానే భారత ప్రభుత్వం డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. గణిత శాస్త్రం అనగానే భారత దేశంలో గుర్తుకు వచ్చే పేరు శ్రీనివాస రామానుజన్. ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను గణితానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేటి తరం విద్యార్థులలో గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని, శ్రద్ధను పెంపొందించాలి, గణితానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించాలి, విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రేరణ కల్పించాలి, గణితశాస్త్రం ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే రామానుజన్ జీవిత చరిత్ర, ఆయన చేసిన అపూర్వ గణిత కృషిని గుర్తు చేసుకోవడం ఈ గణితశాస్త్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశం. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 న తమిళనాడులోని ‘ఈరోడ్’లో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి గణితంలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. 11వ ఏట రామానుజన్ గణిత శాస్త్రం పట్ల అద్భుతమైన దృష్టిని కనబరిచాడు. సంఖ్యలపై ఆయనకి సంపూర్ణ అవగాహన ఉంది. ఇతను ప్రధాన సంఖ్యలు, వింత చదరాలు, వితత భిన్నాలు, వర్గమూలాలగూడు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రాల్స్‌పై పరిశోధన చేశాడు. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఒక ఉదాహరణ. ఫెలో ఆఫ్ ది రాయల్స్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్. గణితంపై ఆయకు ఉన్న పరిశోధనాశక్తి మాత్రం అమోఘం. అలాగే ఇండియన్ మేథమెటికల్ సొసైటీ అనే పత్రికలో వ్యాసాలు అనేకం ప్రచురితమయ్యాయి. ఇక రామానుజన్ చివరి దశలో మాక్ తీట ఫంక్షన్స్‌పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుడు అనేది ప్రధానం కాదు, ఆయన మానవ మేధస్సు ఎంత చేయగలదో నిరూపించాడు. ఓ మహానది లాంటిది రామానుజన్ జీవితం. నది ఎలాగైతే ప్రవహించినంత మేర పరిసరాలని సస్యశ్యామలం చేస్తుందో అలాగే రామానుజన్ వేసిన ప్రతి అడుగు గణిత శాస్త్రాన్ని ప్రకాశవంతం చేసింది. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో ఒక గొప్ప మేధావి. ఆయన జీవితం నేటి విద్యార్థులకు అనేక స్ఫూర్తిదాయకమైన పాఠాలను అందిస్తుంది. శ్రీనివాస రామానుజన్ లాగా ప్రస్తుత విద్యార్థి లోకం గణితంపై గాఢమైన ఆసక్తి, అభిరుచిని చిన్న నాటి నుండి పెంపొందించుకోవాలి. స్వీయ అధ్యయనాన్ని అలవరుచుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఎదురైనా కష్టాలను అధిగమించడంలో నిబద్ధతను ప్రదర్శించాలి. శ్రీనివాస రామానుజన్ సాధారణమైన గణితానికి భిన్నమైన పద్ధతులు ఆవిష్కరించాడు. అలాగే నేటి విద్యార్థులు కూడా సృజనాత్మకత, నూతన ఆలోచనపట్ల ఎలా ఓపికతో ఉండటం, తమ మీద తమకు నమ్మకం కలిగి ఉండటం అనేది అలవరుచుకోవాలి. శ్రీనివాస రామానుజన్ హార్డీ వంటి గొప్ప గణిత శాస్త్రజ్ఞుని సలహా, సహకారం పొందడం ద్వారా గణితంలో గొప్ప స్థాయికి ఎదిగారు. అలాగే నేటి విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని జీవితంలో గొప్ప గా ఎదగాలి. కృత్రిమ మేధస్సు, యంత్ర అధ్యయనం ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. వీటి మూలసూత్రాలు గణిత శాస్త్రంలో దాగి ఉన్నాయి. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (ఎఐ), యంత్ర అధ్యయన (ఎంఎల్) యుగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలంటే గణిత విషయాలైన ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌లో పటిమ, రేఖా గణితం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌పై అవగాహన, డేటా మోడలింగ్, విశ్లేషణ సామర్థ్యం అవసరం. కృతిమ మేధస్సు, యంత్ర అధ్యయనం విద్యార్థుల భవిష్యత్‌ను అద్వితీయంగా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఇలాంటి భవిష్యత్‌ను అందిపుచ్చుకోవడంలో విద్యార్థులు ముందుండాలి అంటే గణితంపై మక్కువను చిన్ననాటి నుండి పెంపొందించుకోవాలి. గణిత శాస్త్రానికి రామానుజన్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణిత శాస్త్రం పట్ల భయాన్ని వీడి ఆసక్తిని పెంపొందించుకుని భవిష్యత్‌లో వచ్చే సవాళ్లను అధిగమించి జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలి.
మహేశ్వరం భాగ్యలక్ష్మి
(అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మాథమాటిక్స్)