Monday, December 23, 2024

గణితం రాకపోతే పోటీలో లేనట్లే.. మ్యాథ్స్ తప్పనిసరి చేస్తూ నిబంధన

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి చూపకపోవడం ఆందోళనకర పరిణామం అని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. పసివాళ్లలో నెలకొని ఉన్న ఈ మ్యాథ్స్ వ్యతిరేక ధోరణితో మన ఆర్థికరంగం తిరోగమనం చెందుతోందన్నారు. దేశంలో మ్యాథ్స్ చదువు పరిస్థితిపై తాను దృష్టి సారిస్తానని, పరిస్థితిని చక్కదిద్దుతానని తెలిపారు. ప్రాధమిక దశ నుంచి విద్యార్థులలో లెక్కల పట్ల మరింత ఆసక్తి పెరిగితేనే రాబోయే తరాలు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లుతాయని చెప్పారు. 18 ఏండ్ల స్థాయి విద్యార్థులకు మరింతగా గణితం బోధించేందుకు స్కూళ్లలో సరైన వాతావరణం కల్పిస్తామన్నారు. గణితంలో వెనుకబాటు తనం గురించి జోక్‌లు వేసుకునే పరిస్థితి పెరిగితే చివరికి మనమే నవ్వులపాలు అవుతామని హెచ్చరించారు. 2023 తొలిపాలసీ ప్రసంగం కార్యక్రమంలో ఆయన సోమవారం మాట్లాడారు. బ్రిటన్‌లో ఇప్పుడున్న విద్యావిధానం మేరకు విద్యార్థులు తమకు లెక్కలు రుచించకపోతే 16వ ఏట లెక్కల సబ్జెక్టు లేకుండా చేసుకునే వీలుంది.

దీనితోనే లెక్క తప్పుతుందని బ్రిటన్ ప్రధాని హెచ్చరించారు. ఇటువంటి విధానాన్ని ముందుగా మార్చాల్సి ఉందన్నారు, విద్యార్థులు 18 ఏండ్ల వయస్సు వచ్చే వరకూ గణితశాస్త్రం తప్పనసరిగా అభ్యసించాలనే నిబంధనలకు దిగుతామని తెలిపారు. ఇప్పుడున్న వ్యవస్థలో 16 నుంచి 19 ఏండ్ల వయస్సులో ఉన్న విద్యార్థులలో అత్యధికులకు లెక్కలు అంటేనే పరమబోర్ పద్థతి ఉందని ఇది ఆందోళనకర పరిణామమన్నారు. చాలా మందికి లెక్కలలో కనీస పరిజ్ఞానం కూడా ఉండటం లేదని, ఇక దేశ ఆర్థిక పరిస్థితి ఇక ముందు ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా గణితానికి, గణాంకాలకు సంబంధిత విజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి ఉద్యోగానికి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ ప్రాతిపదిక అవుతోంది.ఈ దశలో సరైన పునాది లేకుండా రేపటి తరం ప్రపంచ పోటీని ఏ విధంగా తట్టుకుంటుందని ప్రశ్నించారు. మన పిల్లలను చేతులారా గణిత పరిజ్ఞానం లేని స్థితిలో పోటీ ప్రపంచంలోకి తోలుతున్నామని, దీనితో వారు వెనుకబాటుకు , జీవితంలో నగుబాటుకు దారితీస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో మనం మనను చక్కదిద్దుకోవల్సి ఉందన్నారు. భారతదేశంలో గణితానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. లెక్కల సబ్జెక్టును తమ పిల్లలకు సరైన విధంగా అందించే విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటుంటారు.

ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ సంతతి మూలాలున్న ప్రధాని రిషిసునాక్ లెక్కల బోధనకు ప్రాధాన్యత గురించి చాటారని వెల్లడైంది. ఇండియాలో ఓనమాలు నుంచి ఆ తరువాత కూడా గణితం అత్యంత ప్రాధాన్యతల విషయంగా ఉంటూ వస్తోంది. పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇండియా విద్యార్థులు మ్యాథ్స్‌లో ఎక్కువగా రాణించడం, సంబంధిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎక్కువగా భారతీయులకే రావడం వంటి పరిణామాలు బాగా తెలిసిన ప్రధాని సునాక్ దీనిపైనే దృష్టి సారించారు. పైగా పురాతన కాలం నుంచి భారతీయ గణితశాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో ప్రపంచానికి పలు విధాలుగా మేలు చేశారు. భారతదేశంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువగా గణితంలోనే రాణించాలని ఆశిస్తూ ఉంటారు. భారతీయ విద్యారంగం గురించి అవగావహన ఉన్న సునాక్ బ్రిటన్‌లో విద్యార్థులకు మరింత ఎక్కువగా గణిత శాస్త్రం బోధించేందుకు ఎక్కువ మంది టీచర్లు అవసరం అని స్పష్టం చేశారు. ఈ దిశలో చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News