Wednesday, January 22, 2025

జెఇఇ మెయిన్‌లో కఠినంగా మ్యాథమెటిక్స్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2023 సెషన్ -1 పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఎక్కువ భాగం గతంలో ఇచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. అయితే గణితంలో ఇచ్చిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటం కష్టంగానే ఉన్నట్టు చెప్పారు.

ఫిజిక్స్ మధ్యస్తంగా ఉందని, కెమెస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని విద్యార్థులు తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో జరిగిన ఈ పరీక్షలో మేథ్స్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చినట్టు చెప్పారు. టాపర్లు 200కి పైగా, యావరేజి విద్యార్థులు 150కి పైగా మార్కులు పొందే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరీక్ష స్థాయికి తగిన ప్రమాణాలతో ప్రశ్నపత్రం ఉందని పేర్కొంటున్నారు. అభ్యర్థులు జాతీయస్థాయిలో మంచి పర్సంటైల్ సాధించడంలో గణితం, రసాయన శాస్త్రం కీలకం కానున్నాయని చెబుతున్నారు.

గణితంలో తప్పని తిప్పలు

గణితంలో ప్రశ్నలు పెద్దవిగా ఉన్నాయని, ఈ విభాగాన్ని పూర్తి చేయడనికి కనీసం 80 నుంచి 90 నిమిషాల సమయం పట్టింది. 12 నుంచి 14 ప్రశ్నలు సాధారణంగా, 6 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. బేసిక్స్ నుంచి ప్రశ్నలు తక్కువ వచ్చాయని విద్యార్థులు తెలిపారు. ఎక్కువ ప్రశ్నలకు సుదీర్ఘ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చిందని, 3డీ, వెక్టార్ ఆల్‌జీబ్రా, మ్యాథమెటికల్ రీజనింగ్ ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని, ఫార్ములా ఆధారితంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. అందరు విద్యార్థులు 12 ప్రశ్నలు చేయగలుగుతారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నెటిజమ్, మోడ్రన్ ఫిజిక్స్, ఈఎంఐ, ఫ్రిక్షన్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఎసి కరెంట్ అధ్యాయాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ నుంచి 3-4 ప్రశ్నలు ఇచ్చారు.

కెమిస్ట్రీ ఈజీనే

కెమిస్ట్రీ మొత్తం మీద తేలిగ్గా ఉంది. ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగాలకు వెయిటేజీ సమానంగా ఉంది. వాటి నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి తక్కువ ప్రశ్నలు ఇచ్చారు. ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. వాటిలో ఎక్కువ థియరీ ఆధారితంగా ఉన్నాయి. 12 ప్రశ్నల వరకు అందరూ చేయగలుగుతారు. ఇంకా కెమికల్ కైనెటిక్స్, ఈక్విలిబ్రిమ్, పీరియాడిక్ టేబుల్, గ్రాఫ్ ఆధారితంగా ప్రశ్నలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేశాయి.

రాష్ట్రం నుంచి 1.5 లక్షల మంది విద్యార్థులు

జెఇఇ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1.5 లక్షల మంది జెఇఇ మెయిన్స్ రాస్తున్నారు. రాష్ట్రంలోని 17 కేంద్రాల్లో జెఇఇ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం పరీక్షలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 1వ తేదీ వరకూ పరీక్ష జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News