Saturday, November 23, 2024

ఫైనల్లో బెర్రెటిని

- Advertisement -
- Advertisement -

Matteo Berretti of Italy reaches final of Wimbledon

 

లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇటలీ ఆటగాడు, ఏడో సీడ్ మాటియో బెర్రెటిని ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి సెమీఫైనల్లో బెర్రెటిని జయభేరి మోగించాడు. పోలండ్ సంచలనం, 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్‌తో జరిగిన నాలుగు సెట్ల సమరంలో బెర్రెటిని విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన బెర్రెటిని 63, 60, 67, 64తో జయకేతనం ఎగుర వేశాడు. ఈ క్రమంలో బెర్రెటిని కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆరంభం నుంచే బెర్రెటిని దూకుడును ప్రదర్శించాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను కంగుతినిపించి పెను సంచలనం సృష్టించిన హుబర్ట్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు.

బెర్రెటిని జోరుకు ఎదురు నిలువలేక పోయాడు. కళ్లు చెదిరే షాట్లతో హుబర్ట్‌పై విరుచుకు పడిన బెర్రెటిని అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మరింత చెలరేగి పోయిన బెర్రెటిని ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం హుబర్ట్ అనూహ్యంగా పుంజుకున్నాడు. అసాధారణ పోరాట పటిమతో బెర్రెటినికి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో ఆఖరు వరకు ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న హుబర్ట్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా బాగానే పోరాడాడు. అయితే చివరి వరకు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బెర్రెటిని సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

ప్లిస్కోవా, బార్టీ తుది సమరం నేడే

మరోవైపు మహిళల సింగిల్స్ తుది పోరాటానికి టాప్ సీడ్ ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా), 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవాలు సమరోత్సాహంతో సిద్ధమయ్యారు. ఇద్దరి మధ్య శనివారం టైటి ల్ పోరు జరుగనుంది. బార్టీ ఇప్పటికే ఓ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించింది. ప్లిస్కోవా మాత్రం ఇప్పటి వరకు ఒక్క గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ జత చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు అగ్రశ్రేణి క్రీడాకారిణి కూడా టైటి లే లక్షంగా పోరుకు సిద్ధమైంది. నిలకడైన ఆటకు మరో పేరుగా చెప్పుకునే బార్టీ మ్యాచ్ లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ప్లిస్కోవాను కూడా తక్కువ అంచన వేయలేం.

ఎటువంటి క్రీడాకారిణినైనా ఓడించే సత్తా ఈ మాజీ నంబర్‌వన్‌కు ఉంది. ఇటు బార్టీ, అటు ప్లిస్కోవా అద్భుత ఆటతో తుది సమరానికి అర్హత సాధించారు. ఫైనల్లో కూడా తమ జోరును ప్రదర్శించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ప్రపంచ టెన్నిస్‌లో ఇద్దరికి మెరుగైన రికార్డే ఉంది. ఎటువంటి పరిస్థితి అయి నా ఎదురొడ్డి ముందుకు సాగే సత్తా వీరికి ఉందనే చెప్పాలి. మహిళల టెన్నిస్‌లో ఇప్పటికే మెరుగైన క్రీడాకారిణిలుగా పేరు తెచ్చుకున్న బార్టీ, ప్లిస్కోవాల మధ్య జరుగనున్న పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్‌ను గెలవడం ద్వారా చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఇద్దరు ఉన్నారు. దీంతో మహిళల తుది సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News