పోర్టులూయిస్ : అయోధ్యలో శ్రీరామాలయ ప్రతిష్టాపన ఘట్టం నేపథ్యంలో మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న ప్రతిష్టాపన ఘట్టం దశలో ప్రభుత్వోద్యోగులకు రెండు గంటల విరామ సెలవు కల్పించింది. ఈ సమయంలో హిందూ విశ్వాసాల ఉద్యోగులు రాముడి పూజలు నిర్వహించడానికి వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు.అయోధ్యలో కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారానికి తగు ఏర్పాట్లు చేశారు.
దీనితో హిందువులు ఎక్కువగా ఉండే ఇతర దేశాలలోని ప్రాంతాలలో ఈ లైవ్‌ను తిలకించేందుకు అక్కడి హిందూ సంస్థలు తగు ఏర్పాట్లు చేశాయి. మారిషస్‌లో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వోద్యోగులకు రెండు గంటల విరామం ప్రకటించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మారిషస్‌లో ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలకు చెందిన వారు తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డారు. హిందూయిజాన్ని పాటిస్తున్నారు.