Monday, January 20, 2025

ప్రపంచాన్ని ఎరుపెక్కించిన ‘మే డే’ పోరాటం

- Advertisement -
- Advertisement -

కార్మికుల, శ్రమజీవుల హక్కులు, సౌకర్యాల సాధనకు ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు జరిగినప్పటికీ వాటి జ్ఞాపకాలను, చరిత్ర మరువక ముందే ఈ దేశ పాలకులు కార్మిక హక్కులను తొలగించి సంపదను, వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం కార్మిక వర్గాన్ని అణగదొక్కుతూ దేశంలో కార్మికుల ఉనికి లేకుండా చేస్తున్నారు. సాధించుకున్న చట్టాలను , సదుపాయాలను తొలగిస్తున్నారు. పరిశ్రమలను సంపన్న వర్గాలకు, విదేశీ గుత్తేదారులకు కట్టబెడుతున్నారు.

మూగబోతున్న గొంతులే ధిక్కార రణ ఘోషగా మారి మా కాలం తప్పక వస్తుందని చికాగో కాల్పుల ఘటనపై ఉరితీయ బడుతున్న సమయంలో కార్మిక నేత ఆగస్టు స్పైస్ అన్న మాటలు ప్రపంచంలో కార్మికోద్యమ ప్రళయాన్నే సృష్టించాయి. 1887 నవంబర్ 10న చికాగో పోరాటానికి బాధ్యులుగా, దోషులుగా చేస్తూ కార్మిక నేత ఆగస్టు స్పైస్ తో పాటు అతని సహచరులైన ఆర్బార్ పర్సన్, ఎడల్ఫ్ ఫిషర్, జార్జ్ ఏంజిల్‌లను 8 గం. పని దినం కోసం పోరాడిన పాపానికి ఉరి తీయబడ్డారు. వెట్టిచాకిరి, తరాల దోపిడీకి వ్యతిరేకంగా, పని గంటల కాలాన్ని తగ్గింపు కొరకై జరిపిన మహత్తర పోరాట ఫలితమే మే డే దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

అమెరికాతో పాటు అనేక దేశాల్లో 14 నుండి 16 గం. పాటు అవిశ్రాంతంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు పరిశ్రమలలో శ్రమిస్తుండే కాలమది. కార్మికులు తమ హక్కులు, కోర్కెల కోసం నినదించడం మొదలుపెట్టారు. నిరంతర శ్రమకు అడ్డుకట్ట వేస్తూ రోజులో 8 గం. పని దినాన్ని అమలు చేయాలని ఆందోళనలు మొదలుపెట్టారు. అప్పటికే పని గంటల తగ్గింపు కోసం యూరపు, లాటిన్‌అమెరికా, జర్మనీ వంటి దేశాలలో నిరసనలు జరుగుతున్నాయి. అమెరికాలో 8 గం. పని దినం కోసం క్రమంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా నిరసనలు, ఆందోళనలు క్రమంగా విస్తరిస్తున్నాయి. 1866లో బాల్టిమోర్‌లో జరిగిన లేబర్ సదస్సులో ఈ అంశంపై తొలిసారిగా తీర్మానం చేసి ఉద్యమించాలని నిర్ణయించారు.

పలు కార్యక్రమాల ద్వారా యాజమాన్యాల దృష్టికి ఈ సమస్య ను తీసుకెళ్లడం మొదలుపెట్టారు.చికాగోలో 1884 నుంచి మరింత బలంగా పని గంటల డిమాండ్‌ను వినిపించడానికి పలు కార్యక్రమాలను చేపట్టారు. ఆందోళన కార్యక్రమాలు విస్తృతపర్చుతూ వచ్చా రు. 1886 మే 1 నుండి 8 గం. పని దినాన్ని అమలులోకి తేవాలని కార్మిక నాయకులు పరిశ్రమ ల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. ఇందు కోసం ఏప్రిల్ 25 వరకు 19 సార్లు వివిధ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోరాటం ఊపందుకున్నది. మే 3న అమెరికాలోని మిచిగన్ ఎవెన్యూలో ప్రదర్శన తలపెట్టారు. ఈ ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. ప్రదర్శన కోసం వచ్చిన వారిని పోలీసులు బెదిరింపులకు దిగి రెచ్చగొట్టడమే కాకుండా కాల్పులకు దిగారు. పోలీసులు అకారణంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మిచిగన్ ఎవెన్యూలో పోలీసులు జరిపిన కాల్పుల ఘటనకు నిరసనగా మే 4న ముందస్తు అనుమతితో చికాగోలోని హేమార్కెట్ స్క్వెర్ వద్ద బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్మికులు తరలివచ్చారు. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో జనం క్రమంగా తగ్గుతున్నారు.

కొందరు మధ్యలోనే వెళ్లిపోయారు. నాయకుల చివరి ప్రసంగాలు జరిగే సమయానికి జనం పలుచబడ్డారు. సభా ప్రాంగణంలో వందల సంఖ్యలోనే మిగిలారు. పోలీసులు సుమారుగా 175 మంది వరకు అక్కడ ఉన్నారు. ఇంతలో సభా స్థలంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాంబును ఎవరో విసిరారు. అది పోలీసులకు తగిలింది. అంతా గందరగోళం చెలరేగింది. పోలీసులు రెచ్చిపోయి సభపైకి తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపారు.నలుగురు కార్మికులు పోలీసుల కాల్పుల్లో నేలకొలిగారు. అక్కడి నేల ప్రదేశమంతా రక్తసిక్తమైంది. ఆ నెత్తురులో తడిసిన గుడ్డనే పైకెత్తి జెండగా ఎగురవేయగా రక్తంలో తడిసిన జెండా అరుణ పతాకమై ఎరుపెక్కింది. మే డే జెండాగా ప్రపంచానికి ఎర్రజెండానే ఆవిష్కృతమైంది. ఈ ఘటనకు ఎనిమిది మంది కార్మిక నాయకులను దోషులను చేస్తూ పోలీస్‌లు అరెస్టులు చేసి జైలుకు తరలించారు.

ఉరి తీయబడ్డ పైనలుగురు నాయకులతో పాటు ఇంకా శామ్యూల్ ఫీల్డెన్, మైక్ చ్యుపబ్, ఆస్కారనిట్, లూయిస్ లింగ్ అనే నలుగురు కార్మిక నాయకులకు యావజ్జీవ శిక్షవిధించారు. 118 మంది సాక్షులను ప్రవేశపెట్టి నామమాత్రపు విచారణలు జరిపి ఎనిమిది మంది నాయకులపై ఈ విధంగా శిక్షలు అమలు చేశారు. కార్మికుల పోరాటం, నాయకుల త్యాగాలు వృథా పోలేదు. 8 గం. పని దినంతో పాటు పలు హక్కులు, సౌకర్యాలు అమలులోకి వచ్చాయి. కార్మికులు రక్తతర్పణ చేసిన చికాగోలో హేమార్కెట్ స్క్వెర్ ప్రాంతాన్ని 106ఏళ్ల తర్వాత 1992లో చారిత్రాత్మక ప్రదేశంగా ప్రకటించి స్మారక నిర్మాణాలు చేశారు. 2004లో ఒక మాన్యుమెంట్‌ను నిర్మించారు. ఉరి తీయబడ్డ అమరుల స్మారక చిహ్నంగా ఫారెస్ట్ పార్క్ స్మృతివనాన్ని 1997లో ఏర్పాటు చేశారు. 1889లో పారిస్ మొదటి సోషలిస్టు ఇంటర్నేషనల్‌లో మే డేను ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరిపారు.

ఎబూసి ఆగయ్య
9849157969

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News