న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందున వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరమయ్యే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందని, ఈ పరిస్థితుల్లో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా మనకు బూస్టర్ డోసులు అవరసముందని ఆయన అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేలా అన్ని రకాల కరోనా వైరస్‌లను ఎదుర్కొనే సామర్ధం కలిగి ఉండే రెండో తరం టీకాలు రాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరినాటికి అవి అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే మొదట ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఈ బూస్టర్ డోసుల పంపిణీ ఉంటుందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో గులేరియా వివరించారు.
సెప్టెంబర్ నాటికి చిన్నారులకు టీకా
సెప్టెంబర్ కల్లా పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభిస్తామని, పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుందని గులేరియా వివరించారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో చిన్నారులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా పిల్లలపై ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్ నాటికి వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరో సంస్థ జైడస్ క్యాడెలా ఇటీవల అత్యవసర అనుమతులు కోసం చేసుకున్న దరఖాస్తుల్లో చిన్నారులపై ప్రయోగాల వివరాలను కూడా అందించింది. మరికొన్ని వారాలు లేదా సెప్టెంబర్ చివరినాటికి దేశంలో చిన్నారులకు టీకా అందుబాటు లోకి రావచ్చు. అప్పుడు దశల వారీగా స్కూళ్లు కూడా తెరిచేందుకు వీలుంటుందని గులేరియా పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా జైకోవ్ డి టీకాను తయారు చేసింది. 1218 ఏళ్ల పిల్లలపై కూడా ప్రయోగాలు చేసింది. ఇటీవల ఆ డేటాను కేంద్రానికి అందించి అత్యవసర వినియోగానికి అనుమతి కోరింది. త్వరలోనే జైడస్ క్యాడిలా టీకా వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవాగ్జిన్ ట్రయల్స్ కూడా ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ముగుస్తాయి. ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఎఫ్‌డిఎ ఆమోదం పొందింది. దేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చామని ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పెద్దలందరికీ టీకాలు వేయాలని లక్షంగా పెట్టుకున్నామని వివరించారు.
May need Booster dose for emerging variants