వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి చేస్తున్న ప్రతిపక్ష ఐక్యతా యత్నాలను నీరుగార్చినట్లయ్యింది. 543 లోక్‌సభ స్థానాలకు గాను సాధారణ మెజారిటీ రావాలంటే ఏ పార్టీ, కూటమి అయినా 272 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. 80 లోక్‌సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకే కేంద్రంలో దక్కుతున్న ఆనవాయితీ వుంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాలక భారతీయ జనతా పార్టీ 2014 నుండి గరిష్ఠ స్థానాలు గెలుస్తూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ, సిపిఐ, సిపిఎం, లాలూ నేతృత్వంలోని ఆర్‌జెడి, బీహార్ సిఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె డియు, తమిళనాడులో డిఎంకె, మిత్రపక్షాలతో కలిసి ఆయా రాష్ట్రాల్లో లౌకిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి కమలం పార్టీపై ఒకే ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని,
మోడీ బిజెపి మళ్ళీ గెలవకుండా నిరోధించాలని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాల్లో 17 ఎస్‌సి రిజర్వుడ్ స్థానాలు. వాటిలో కాషాయ పార్టీ 2014లో 72 స్థానాలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 62 స్థానాలు అత్యధికంగా గెలిచి వరుసగా రెండు దఫాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి వరుసగా 3వసారి ప్రధాని కావాలని, రికార్డులు తిరగరాయాలని మోడీ బహుముఖ వ్యూహంతో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకు అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామాలయ ప్రారంభోత్సవానికి జనవరి 22న సంప్రోక్షణ కార్యక్రమాన్ని అట్టహాసంగా, నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహిస్తూ ఘనత అంతా తమ ప్రభుత్వానిదేనని చాటుతున్నారు. పురుషోత్తముడు, సకల గుణాభిరాముడు, భారతీయులకు తరతరాలుగా ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీరామచంద్రుని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలను కమలనాథులు ఖాతరు చేయడం లేదు. దేశంలో పల్లెపల్లెనా రాములగుడి ఉంది.
అందునా తెలుగు వారికి శ్రీరాముడు ఆరాధ్య దైవం. భద్రాద్రి రామయ్య, ఒంటిమిట్ట కోదండ రాముడు ఎందరికో ఇలవేల్పులు. పగలంతా పని పాట్లతో శ్రమించే అన్నదాతలు, శ్రామికులు సాయంత్రం వేళల్లో రామ భజనలతో ఊరట చెందడం తెలుగు రాష్ట్రాలలో కమనీయ దృశ్యాలే. నిజానికి ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే భక్తజనులు శ్రీరామున్ని గుణగానాలతో తన్మయత్వం చెందడం కద్దు. ప్రార్థన వ్యక్తిగతం. అయితే రాజకీయ లబ్ధి కోసం పార్టీలు, నేతలు ఇటీవలి కాలంలో భక్తుల విశ్వాసాలను వాడుకోవడం చూస్తున్నాము. రామాలయ ప్రారంభ కార్యక్రమం భక్తులందరికీ సంబంధించిన అంశం. అధికార పార్టీ ఆ ఖ్యాతి తమకే దక్కాలనే పేరాశతో ఇతరులను నిర్లక్ష్యం చేయడంతో కాంగ్రెస్, తదితర పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం కమలం పార్టీకే మేలనే అభిప్రాయాలూ వున్నాయి. ఒక వంక రామాలయ నిర్మాణ ఖ్యాతిని దక్కించుకుంటూనే, బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడకుండా కమలనాథులు చేయవలసింది అంతా చేస్తున్నారు. ‘ఇండియా’ కూటమిలో కి బహుజన సమాజ్ పార్టీని కలుపుకోవడానికి హస్తం పార్టీ తెర వెనుక ప్రయత్నిస్తున్నదనే సంగతి పసిగట్టి, ఇడి, సిబిఐ,
ఆదాయపు పన్ను కేసులను తవ్వి తీస్తామని మోడీ మంత్రివర్గంలోని ఓ మంత్రి బెదిరించగానే మాయావతి తన స్వరం మార్చి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. బిఎస్‌పి వ్యవస్థాపకుడు స్వర్గీయ కాన్షీరాం అపర చాణక్యుడుగా ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీతో కలసి ఐక్యసంఘటన నిర్మించడంతో మాయావతి 1995లో తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పరస్పర విశ్వాస రాహిత్యం వల్ల అదెంతో కాలం నిలువలేదు. 1995 జూన్ 3 నుండి అక్టోబర్ 18 వరకు కొన్ని నెలలు మాత్రమే యుపి 18వ ముఖ్యమంత్రిగా అధికారంలో వున్నారు. 1997 మార్చి 21 నుండి సెప్టెంబర్ 21 వరకు రెండోసారి, 2002 మే 3 నుండి ఆగస్టు 29 వరకు మూడోసారి, 2007 మే 3 నుండి 2012 మార్చి 15 వరకు ఐదేళ్ళు పూర్తి కాలం మాయావతి 4వసారి యుపి ముఖ్యమంత్రిగా వున్నారు. ఆ తర్వాత 2012 నుండి 2017 వరకు రాజ్యసభలో యుపి నుండి ప్రాతినిధ్యం వహించారు. యుపిలో బిజెపి బలహీనంగా వున్న
కాలంలోనే బిఎస్‌పి ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. అయితే బిఎస్‌పికి ఓటేసిన దళితులు, దళితేతరులు, యాదవేతర బిసిలు క్రమంగా కమలం పార్టీ వైపు మొగ్గడంతో ఎస్‌పి, బిస్‌ఎస్‌పి బలం తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బలమైన భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడానికి చేతులు కలిపిన ఎస్‌పి, బిఎస్‌పిలు కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలి 2 స్థానాలు వదిలేసి చెరి 38 లోక్‌సభ స్థానాలకు పోటీ చేశాయి. ఈ పొత్తుతో బిఎస్‌పి బాగా లబ్ధి పొందింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఒక్క స్థానం గెలవలేని బిఎస్‌పికి 10 లోక్‌సభ స్థానాలు రాగా, సమాజ్‌వాది పార్టీకి కేవలం ఐదు స్థానాలే రావడంతో అఖిలేశ్ యాదవ్ హతాశుడయ్యారు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కూటమి కుప్పకూలింది. ఎస్‌పి ఓట్లు తమకు రాలేదని, బిఎస్‌పి మద్దతు వల్ల సమాజ్‌వాదీ పార్టీ లాభపడిందనడం వాస్తవ విరుద్ధం. ఈ ఐక్యతను దెబ్బతీయడానికి కమలం పార్టీ మిత్రభేదం కల్పించి చేయవలసిందంతా చేసింది. బిఎస్‌పికి ఇతర రాష్ట్రాలలో స్థానాలున్నా, నామమాత్రంగా సీట్లు గెలుస్తున్నా ప్రధాన బలం దేశంలో దాదాపు
25 కోట్ల జనాభా 400 శాసనసభ, 80 లోక్‌సభ స్థానాలున్న యుపిలో నే. యుపిలో దళిత జనాభా 20.7%, జాతవ్‌లు, పాసి, దోభి, వాల్మీకి తదితర 66 ఉపకులాలున్నాయి. వారిలో 10 శాతంగా వున్న జాతవ్‌లదే ప్రాబల్యం. మాయావతి జాతవ్. అందుకే కొన్ని ఉప కులాలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్‌దే పెత్తనం. ముస్లింలు, దళితులు, బ్రాహ్మణులు, రాజపుత్రులు, వైశ్యులు కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉండేవారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రులుగా బ్రాహ్మణుల పెత్తనమే ఉండేది. జాట్లు తదితర కొన్ని వ్యవసాయ కులాలతో రైతాంగాన్ని, బిసిలను చేరదీసి చరణ్ సింగ్ భారతీయ లోక్‌దళ్ పార్టీని ఏర్పాటు చేసినా అది ఎదగలేకపోయింది. కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రమే. ఈ సామాజిక నేపథ్యంలో బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ 1990వ దశకంలో జరిపిన రామ్థ్ర యాత్రతో హిందూత్వ శక్తుల పార్టీగా బిజెపి బలం పుంజుకుంది.
2013 నాటికి కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలతో అప్రతిష్ఠలు గురి కాగా, హిందూ హృదయ సామ్రాట్‌గా నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి సొంత బలంతో అధికారానికి వచ్చి, రెండోసారి మరింత మెజారిటీతో ముఖ్యంగా యుపి వంటి హిందీ రాష్ట్రాల మద్దతుతో పాలన సాగిస్తూ, వరుసగా 3వసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకే ఆ పార్టీ బలం పరిమితం. దక్షిణాదిలో వున్న కర్నాటకలో కూడా అధికారం కోల్పోయింది. అయితే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు కేంద్రంలో వరుసగా 3 వసారి కూడా విజయం తమదేనని కమల నేతలు ప్రధానంగా ప్రధాని మోడీ ధీమాగా వున్నారు.అయితే అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలతో బతుకు భారమైందనే అసంతృప్తి రాజుకుంటోంది. సరైన జాతీయ ప్రత్యామ్నాయం లేకపోవడం
కమలనాథులకు కలిసొచ్చింది. లౌకిక ప్రజాస్వామ్య జాతీయ ప్రత్యామ్నాయం నిర్మాణానికి కాంగ్రెస్, తదితర పార్టీలు యత్నిస్తున్నా అంతర్గత విభేదాలు, వైరుధ్యాల వల్ల అది కొలిక్కి రాలేదు. అలా సాగుతున్న ప్రయత్నాలకు బిఎస్‌పి వంటి పార్టీలను బెదిరించడం ద్వారా ప్రతిపక్షాలు ఏకం కాకుండా కకావికలు చేసే కమలం దుస్తం త్రం ప్రస్తుతానికి పారినట్లే కనిపిస్తోంది. దేశంలోని ఓ పెద్ద దళిత పార్టీ చేరువకాకుండా ఏ ప్రతిపక్ష కూటమి బలం పుంజుకోలేదు. చాలా రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీ బాగా శిధిలమై, నిర్మాణపరంగా వివిధ వర్గాల ప్రజలను కూడగట్టే సామర్థ్యాన్ని కోల్పోయింది. దీటైన ప్రత్యామ్నాయం లేకే ప్రజలు చేసేదిలేక ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో కమలం పార్టీ వైపు మొగ్గుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలనే మాయావతి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం పాలక బిజెపికి మేలు చేస్తుంది. యుపిలో ఒంటరిగా బరిలోకి దిగి ఏనుగు తన పూర్వబలాన్ని సాధించగలుగుతుందా లేక ప్రతిపక్ష ఓట్లు చీల్చి కమలానికి అమిత బలం చేకూరుస్తుందా!