Monday, November 18, 2024

బీఎస్‌పి అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్ : కేంద్రంలో తమ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ ) అధికారం లోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి గట్టి చర్యలు చేపడతామని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఆదివారం కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముజఫర్‌నగర్ బీఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దారాసింగ్ ప్రజాపతికి మద్దతుగా ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే, వోటింగ్ యంత్రాలు టాంపరింగ్ కాకుండా ఉంటే ఈసారి బీజేపీ మళ్లీ అధికారం లోకి రాదని ఆమె స్పష్టం చేశారు.

బీజేపీ తన పాలనా కాలంలో ఎక్కువ కాలం కుబేరులను మరింత కుబేరులుగా చేయడానికే వెచ్చించిందని, మిగతా పార్టీలు కూడా వాణిజ్యవేత్తల ఆధారంగానే తమ పార్టీలను నడపడం , ఎన్నికల్లో పోటీకి నిలబడడం చేస్తున్నాయని ఎలెక్టోరల్ బాండ్ల డేటాలో ఈ విషయం వెల్లడైందని మాయావతి వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వుఅయిన ఉద్యోగాల ఖాళీలను బీజేపీ భర్తీ చేయడం లేదని ఆరోపించారు.

గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రం లోను, కొన్ని రాష్ట్రాల్లోను బీజేపీ అధికారంలోఉండడంతో ముస్లింల పురోగతి చాలావరకు ఆగిపోయిందని, మతం పేరుతో హింస ఇక్కడ పెరిగిందని ధ్వజమెత్తారు. జనరల్ కేటగిరిలో ఉన్న పేదలు కూడా బీజేపీ పాలనలో ఎలాంటి ప్రయోజనం పొందలేక పోయారని విమర్శించారు. ర్యాలీకి ముందు షహరాన్‌పూర్ జిల్లాలో ప్రజా బహిరంగ సభలో మాయావతి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీఎస్‌పి 10 సీట్లు సాధించడానికి సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News