Friday, November 22, 2024

మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ నా వారసుడు: మాయావతి

- Advertisement -
- Advertisement -

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్ తాజాగా బిఎస్‌పి జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు, మాయావతి వారసుడిగా ఆకాశ్ ఆనంద్ ఎంపిక వివరాలను బిఎస్‌పి నేత సర్వర్ మాలిక్ వెల్లడించారు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిఎస్‌పి ఒక్క స్థానం కూడా గెలవలేక చతికిలపడింది, ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయావతి ఆదివారం లక్నోలో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఆకాశ్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన బిఎస్‌పి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మాయావతి తన రాజకీయ వారసుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి కాకపోవడం. ఆమె గతంలోనూ ఒకసారి అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇటీవలి ఎన్నికల ముందు అతనిని రెండు హోదాల నుంచి తొలగించారు,

ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా, డాక్టర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను, కాన్షీరామ్ కలసి పార్టీని ఏర్పాటు చేసి, అందు కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు చెప్పారు, ఈ దిశగా పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడి హోదా నుంచి, పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పిస్తున్నానని ఆమె ఆ సమయంలో తెలిపారు. అతను పరిణతి సాధించే వరకు ఈ ప్రకటన వర్తిస్తుందని ఆమె వెల్లడించారు. రెండు వర్గాల మధ్య విద్వేషం పెంపొందిస్తున్నాడన్న ఆరోపణలతో పాటు, పలు ఇతర అభియోగాలతో ఆకాశ్ ఆనంద్‌పై ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానితో అతనిపై వేటు వేస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిఎస్‌పి 424 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు, ఈ క్రమంలో రెండు హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News