లక్నో: భారతీయులందరి డిఎన్‌ఎ ఒకటేనంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, కేంద్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోందని మాయావతి ఆరోపించారు.
ఆదివారం ఘజియాబాద్‌లో భగవత్ ప్రసంగిస్తూ హిందువులు, ముస్లిములు వేర్వేరు కాదని, మతాలకు అతీతంగా భారతీయులందరి డిఎన్‌ఎ ఒకటేనని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై మంగళవారం మాయావతి ఒక ప్రకటన విడుదల చేస్తూ సమాజాన్ని ఏకం చేసే బాధ్యతను రాజకీయ పార్టీలకు వదలకూడదన్న భగవత్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని చెప్పారు.
బిజెపికి, ఆ పార్టీ ప్రభుత్వాలకు ఆర్‌ఎస్‌ఎస్ గుడ్డిగా మద్దతు ఇవ్వడం వల్లే దేశంలో కులతత్వం, రాజకీయ విద్వేషం, మతపరమైన హింస చెలరేగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ సహకారం, మద్దతు లేకుండా బిజెపి మనుగడే లేదని, తాను చెబుతున్న సిద్ధాంతాలను ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు బిజెపి, ఆ పార్టీ ప్రభుత్వాల చేత అమలు చేయించలేకపోతోందని మాయావతి ప్రశ్నించారు. ఇలా ఉండగా, మాయావతి ప్రకటనపై ఉత్తర్ ప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి సాక్షి దివాకర్ మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక దేశభక్తి సంస్థని, దేశ, సమాజ నిర్మాణం లక్షంగా సంఘ్ పనిచేస్తోందని అన్నారు.