మరో వివాదంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి
ఓ ఎస్‌ఎఫ్‌ఎతోపాటు ఇద్దరు పారిశుద్ద కార్మికుల తొలగింపు
వీరి స్థానంలో మేయర్ సన్నిహితులతో భర్తీ
అదేమీ లేదంటూ డిప్యూటీ కమిషనర్ వివరణ
భర్తీ చేసిన వారి పేరుతో కూడిన జాబితాను విడుదల చేసిన బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. జిహెచ్‌ఎంసిలో కొత్తగా ఇద్దరు పారిశుద్ద కార్మికులతో పాటు ఓ ఎస్‌ఎఫ్‌ఎ నియామకంలో మేయర్ ప్రమేయం ఉన్నుట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ సర్కిల్(18)లో శానిటరీ ఫీల్ట్ అసిస్టెంట్(ఎస్‌ఎఫ్‌ఎ)గా సాయిబాబాతో వి.భారతి, ఎల్.రమాదేవిలు పారిశుద్ద కార్మికులను విధుల నుంచి తొలగించి వీరి స్థానంలో మేయర్ ఇంట్లో పనిచేస్తున్న కుటుంబ సభ్యులను నియమించడం వివాదానికీ దారి తీసింది. మేయర్ కోసమే సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ఈ ముగ్గురిని ఆకారణంగా తొలగించి మేయర్ ఇంట్లో పని చేస్తున్నవారి కుటుంబ సభ్యులను నియమిస్తూ గత నెల 26 జిహెచ్‌ఎంసి ఉత్తర్వులను జారీ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిహెచ్‌ఎంసి కొత్తగా నియమించిన ఈ ముగ్గుల్లో ఎల్ రమాదేవి స్థానంలో నియమించిన పి. లక్ష్మి రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు డ్రైవర్ తల్లి కాగా, వి.భారతి స్థానంలో నియమించిన టి. స్వాతి మేయర్ గద్వాల విజయలక్ష్మి కారు డ్రైవర్ భార్య. అదేవిధంగా ఎస్‌ఎఫ్‌ఎ సాయిబాబా స్థానంలో నియమించిన కె. తిమమ్మ మేయర్ అనుచరురాలు కావడం గమన్హారం.
బాధితుల వివరాల ప్రకారం ః
జిహెచ్‌ఎంసిలో పారిశుద్ద కార్మికురాలుగా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నటు బాధితురాలు వి. భారతి తెలిపింది. అయితే గత ఏఫ్రిల్ 20వ తేదీన తను కరోనా భారిన పడడంతో ఖమ్మం ఆసుపత్రి చేరినట్లు వెల్లడించింది. దీంతోతన కూతురైన తోటి కార్మికురాలు రమాదేవిని తోడుగా తీసుకు వెళ్లాలని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మే 11వ తేదీన విధుల్లోకి రాగా తనతో పాటు తన కూతురు రమాదేవిని, ఎస్‌ఎఫ్‌ఎ సాయిబాబాను సైతంం తొలగించినట్లు అధికారులు తెలిపారన్నారు.అయినా జీతాలు ఇవ్వకున్నా తాము గత రెండు నెలలుగా విధులను నిర్వహిస్తునే అధికారులుతో పాటు మేయర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నామన్నారు. దీంతో మేయర్ దగ్గర పనిచేస్తున్న మనుషులు తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు సోమవారం ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
4 నెలలుగా విధులకు డుమ్మా ః డిప్యూటీ కమిషనర్
జిహెచ్‌ఎంసి సర్కిల్ 18లోని 92వ వార్డుల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన ఎస్‌ఎఫ్‌ఎగా పనిచేస్తున్న కె.సాయిబాబా తన విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినందునే ఉద్యోగం నుంచి తొలగించినట్ల జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఎతో పాటు 2021 జనవరి నుంచి 2021 ఏఫ్రిల్ 20వ తేదీ వరకు అనధికారికంగా విధులకు గైరుహాజరైన శానిటరీ ఉద్యోగులు ఎల్.రమాదేవి, వి.భారతిలను కూడా విధుల నుంచి తొలగించిట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఈ ఇద్దరు పారిశుద్ద కార్మికులు జనవరి నుంచి ఏఫ్రిల్ 20వ తేదీ వరకు విధులకు హాజరు కాకున్నా అయినట్లుగా బయో మెట్రిక్‌లో ఎస్‌ఎఫ్‌ఎ సాయిబాబా తప్పుడు హాజరు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈఘటన వెలుగులోకి రావడంతో విచారణకు హాజరుకావాల్సిందిగా సాయిబాబాకు రెండుసార్లు నోటీసులను పంపినా హాజరు కాలేదని, పూర్తిస్థాయి విచారణ అనంతరం కమిషనర్ అనుమతితో సాయిబాబాతో పాటు ఆ ఇద్దరి పారిశుద్య కార్మికులను విధులను నుంచి తప్పించినట్లు వెల్లడించారు. వీరి స్థానంలో ఇప్పటీ వరకు మరేవరిఇని కూడా నియమించలేదని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అయితే గత నెల 22న 24 మందిని తొలగిస్తూ వారి స్థానంలో మరో 24 మందిని నియమిస్తూ జిహెచ్‌ఎంసి ఎల్‌ఆర్ నంబర్ 322/జెడ్‌సి/కెజెడ్/ జిహెచ్‌ఎంసి/2021 ఉత్తర్వులను జారీ చేసింది.ఈ జాబితాలో ఎల్.రమాదేవి, వి.భారతితోపాటు ఎస్‌ఎఫ్‌ఎ సాయిబాబాలను తొలగిస్తూ వీరి స్తానంలో కొత్తగా పి. లక్ష్మి, టి.స్వాతితోపాటు కె.తిమమ్మలను నియమించినట్లు అధికారులు స్వయంగా రూపొందించిన జాబితాను బాధితులు మీడియాకు విడుదల చేయడం గమన్హారం.
Mayor Gadwal Vijayalaxmi again caught in Controversy