Monday, December 23, 2024

నేటి వరకు ఎంబిబిఎస్ రెండో విడత రిపోర్టింగ్ గడువు పొడగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిబిఎస్ రెండవ విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం వరకు పొడిగించింది. ఈ మేరకు యూనివర్సిటీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబిబిఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ పూర్తి కాగా, సీట్ల పొందిన విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు గడువు గురువారంతో ముగియనుండగా, తాజాగా కాళోజీ వర్సిటీ ఒక రోజు గడువును పొడిగించింది. కళాశాలల్లో చేరేందుకు గడువు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావును కోరారు. అదే విధంగా ఎంబిబిఎస్ మూడో విడత కౌన్సిలింగ్‌లోను తమకు అవకాశం కల్పించాలని, లేదంటే మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రికి వివరించారు. విద్యార్థుల అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకొని రెండో విడతలో ప్రవేశాలు పొందిన వారికి అప్ గ్రేడేషన్‌కు అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు.

అదే విధంగా రెండవ విడతలో ఎంబిబిఎస్ సీట్లు పొందిన అభ్యర్థులకు శుక్రవారం సాయింత్రం వరకు గడువు పొడగించాలని, మూడవ విడత కౌన్సిలింగ్‌లో అవకాశం కల్పించాలని కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను ఆదేశించారు. ఈ మేరకు యూనివర్సిటీ కళాశాలలో చేరేందుకు శుక్రవారం వరకు గడువు పొడిగించింది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు అభ్యర్థులకు మూడో విడత కౌన్సిలింగ్‌లో అవకాశం కలిపిస్తామని కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. విద్యార్థులు శుక్రవారం సాయింత్రం లోగా సంబంధిత ధ్రువపత్రాలతో కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలనీ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News