నిజామాబాద్ బ్యూరో: కాంగ్రెస్ వివాదాల పార్టీ అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అర్థం లేని ఆరోపణలు చేస్తూ వివాదాలను సృష్టించే పార్టీ అని, బిజెపి తమకు అనుకూలంగా మార్చుకుని పబ్బం గడుపుకునే పార్టీ అని ఆమె ధ్వజమెత్తారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటిహబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బిఆర్‌ఎస్ చేపట్టి ప్రతి అభివృద్ధి సంక్షేమ పనులను అర్థంలేని విధంగా ఆరోపించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్, బిజెపి పార్టీలపై కవిత విరుచుకపడ్డారు. కాంగ్రెస్ ఆర్టీసీ విలీనం కూడా వివాదం చేస్తుందని కవితక్క ఆరోపించారు. సెక్రటేరియట్ నిర్మాణంపై అవినీతి జరిగిందని వివాదం చేశారని అన్నారు. నేలమాళిగలు, గుప్తా నిధుల కోసం సచివాలయం కడుతున్నామని కాంగ్రెస్ బిజెపిలో దుష్ప్రచారం చేశారని ఆమె తెలిపారు.
ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలో ఆస్తుల కోసం అంటూ ఆగమాగం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇరుపార్టీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి మాటలను నమ్మవద్దని రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధ్ది చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రుణమాఫీ మా ఎన్నికల ఎజెండాలో భాగమని అందుకు కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం అయిందని దానిని కూడా రాద్ధాంతం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ ఇది కాంగ్రెస్ విజయం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఉన్న రైతులలో 25వేలు ఉన్న వాళ్ళకి ఇప్పటికే రుణమాఫీ చేస్తామని, పూర్తి రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తి రుణమాఫీ చేస్తూ అసెంబ్లీలో ప్రకటన చేయడం వారికి తెలియనట్లు లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కాంగ్రెస్ విజయం కాదని కానీ మూడవసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం పరోక్షంగా మాత్రం కాంగ్రెస్ విజయమే అని చమత్కరించారు. కెసిఆర్ ఎప్పుడైనా ఏపని అయిన బాజప్త చెప్పి చేస్తారని తెలిపారు. 19 వేల కోట్ల నిధులతో 35 లక్షల మంది మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కెసిఆర్‌కు దక్కుతుందని కవిత పేర్కొన్నారు.
కెసిఆర్ తప్పకుండా ప్రజల దీవెనలతో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్, బిజెపి ఆరోపణలు అర్థం లేనివని తెలంగాణ ప్రజలు రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్‌రావు, ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.