కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ పిలుపు
పుణే : దేశంలో భారీ స్థాయిలో ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి చర్యలు తీసుకోవల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పలు రంగాలలో ప్రత్యేకించి వ్యవసాయం, నిర్మాణ రంగాల పనులలో ఈ ఇంధనం వాడకానికి వీలుందని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి అయిన గడ్కరీ వెల్లడించారు. పెట్రోలు డీజిల్ వంటి నిత్యావసర ఇంధన కొరతలు తీవ్రస్థాయి సంక్షోభాలకు దారితీస్తాయనే విషయం ఇటీవలి పరిణామాలతో స్పష్టం అవుతోంది. ఈ దశలో మనము ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంధన దిశలో సానుకూల వేరు మార్గాలను ఎంచుకోవల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ రాష్ట్ర స్థాయి షుగర్ కాన్ఫరెన్స్ 2022లో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని పుణేలోని వసంత్‌దాదా షుగర్ ఇనిస్టూట్ ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయ ఇంధనమే మానవాళికి భవిష్యత్తును నిర్ధేశిస్తుంది. వ్యవసాయ రంగంలో ఇథనాల్‌ను విరివిగా వాడుకోవచ్చు.
వ్యవసాయ రంగ అనుబంధ ఉత్పత్తిగా ఇథనాల్‌ను రూపొందించడం, దీనిని దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన అవసరాలదిశలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇంధన రంగ సంక్షోభం మన దేశాన్ని తాకే ముప్పు ఉండదని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు వచ్చాయి. త్వరలోనే ఇదే తరహాలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ట్రక్కులు వస్తాయని త్వరలోనే తాను వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతామని చెప్పారు. చక్కెర పరిశ్రమ అనుబంధంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ ఇంధన ప్రత్యామ్నాయం కావడం వల్ల దేశంలో ఇంధన కొరత తీరుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ ఉన్న డీజిల్ ఆధారిత వ్యవసాయ పనిముట్లు పెట్రోలు ఆధారితం కావడం, ఇదే క్రమంలో ఫ్లెక్స్ ఇంజిన్లు ఇథనాల్‌తో నడిచేలా ఏర్పాట్లు చేసుకోవల్సి ఉందన్నారు. చక్కెర ఉత్పత్తి పాతకాలపు ప్రక్రియ అయింది. ఇక ఈ పరిశ్రమలోని వారు ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే ఇథనాల్ ఉత్పత్తి దిశలో ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చక్కెరకు డిమాండ్ ఎల్లవేళలా ఉండదు. ఇప్పుడున్న డిమాండ్ తాత్కాలికమే. దీనిని అంతా గుర్తించాల్సి ఉంది. ముడిచమురు ధరలు బారెల్‌కు 140 డాలర్ల స్థాయికి చేరగానే బ్రెజిల్ ఎక్కువగా చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి తెలిపారు, దీనితో ఇప్పుడు ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా చక్కెర డిమాండ్ తలెత్తిందని వివరించారు. ఎప్పుడూ డిమాండ్ ఉండేది కేవలం ఇంధన వనరులకే అని గడ్కరీ స్పష్టం చేశారు.