వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ శకం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజును చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల్లో యాంత్రీకరణ కీలకమైనది. వ్యవసాయ రంగంలో వివిధ పంటల సాగు వ్యయాన్ని తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడంలో యాంత్రీకరణ అనివార్యం గా మారింది. దీనికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.1,500 కోట్లు కేటాయించడాన్ని నిదర్శనంగా భావించవచ్చు. యాంత్రీకరణ వేగాన్ని పెంచడానికి ఊబర్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. రైతులకు మండలాల వారీగా పంటలకు అవసరమైన వివిధ పనిముట్లను, యంత్రాలను పట్టణాల్లో ప్రజలు ఊబర్ సేవలను వినియోగించుకునే విధానంలోనే వ్యవసాయానికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, అంకితభావానికి మరో నిదర్శనంగా చెప్పవచ్చు. రైతులు ఇకపై వరి పంట కోసం ట్రాక్టర్లు, విత్తనాలను నాటే యంత్రాలు, పంటను కోసే హార్వెస్టర్లను గంటల ప్రాతిపదికన ఊబర్ నుంచి అద్దెకు తీసుకోవచ్చు.
వరి పంటలోనే కాకుండా ఇతర పంటలలో వాడే అనేకానేక పని ముట్లను కూడా ఇదే తరహాలో వాడుకొని నిర్దేశించిన అద్దెను చెల్లించవచ్చు. ప్రస్తుతం రైతులు వీటి వినియోగంపై అత్యధికంగా ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణలో వీటిని అందుబాటు ధరలో అందిస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నదని ఎస్ నిరంజన్ రెడ్డి ప్రకటించడం పట్ల రైతులు, శాస్త్రజ్ఞులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో దేశ విదేశాల అనుభవాలను, శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు. యాంత్రీకరణ విస్తరణతో రాష్ట్రంలో సాగు వ్యయాలు తగ్గడమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్‌కు అవసరమైన నాణ్యమైన పంటలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతున్నది. యంత్రాలను ఎంతగా ప్రవేశపెడితే అంతగా రైతు కూలీల కొరత సమస్యను నివారించవచ్చు.
గ్రామాల్లో వ్యవసాయ రంగంలో ప్రస్తుతం సరైన సమయంలో కూలీలు దొరకడమనేది ప్రధాన సవాలుగా మారింది. దొరికినా కూలీల రేట్లు ప్రతి పంట సీజన్‌కు పెరుగుతూ రైతులను ఆందోళను గురి చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలకు పంటలకు ఇచ్చే కూలీల కన్నా నిర్మాణ రంగ, ఇతరత్రా రంగాల కూలీలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి తోడు ఉపాధి హామీ వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనితో ఎక్కువ శ్రమ, ఎక్కువ పని గంటలతో తక్కువ వేతనం ఇచ్చే వ్యవసాయం కన్నా ఇతర రంగాల పట్ల కూలీలు ఆకర్షితులవుతున్నారు. కొందరు రైతులు కూలీలు దొరక్క కాడిని వదిలేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ అనుభవాల దృష్టా ప్రభుత్వం రాయితీ ధరలతో రైతులకు అధునాతన పనిముట్లు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇవ్వడం ద్వారా కూలీల సమస్యను అధిగమించాలని ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. కరోనా సమయంలో కూడా వ్యవసాయమే రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో కీలకంగా మారిన విషయం రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వే గణాంకాలతో సహా వివరించింది. దేశంలో, రాష్ట్రంలో సేవా, ఉత్పత్తి రంగాలు కరోనా దెబ్బకు చతికిలపడితే తెలంగాణలో వ్యవసాయం ఒక్కటే వృద్ధి రేటుతో ఆర్థిక రంగాన్ని కాపాడింది. దేశ స్థూల ఉత్పత్తి రేటు గడిచిన సంవత్సరంలో 7.8 ఉంటే కరోనా దెబ్బకు మైనస్ 3.8కి పడిపోయింది.
కాని రాష్ట్రంలో జిఎస్‌డిపికి రేటు ప్లస్ 1.3 గా ఉండడానికి వ్యవసాయంలో వృద్ధినే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ద్వితీయ రంగం 5.3 శాతం, సేవా రంగం 1.9 శాతం తగ్గినా వ్యవసాయంలో వృద్ధి రేటు మాత్రం ప్లస్‌గా నిలవడానికి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఇప్పటి వరకు జిఎస్‌డిపి కోసం సేవా రంగంపైనే ఆధారపడగా ప్రస్తుతం ఉత్పత్తి రంగంతో పాటు వ్యవసాయ రంగంలో కూడా వృద్ధిని రెండింతలు చేయడానికి కంకణం కట్టుకొని విధాన నిర్ణయాలు అమలు చేయడంలో భాగమే యాంత్రీకరణ. క్షేత్ర స్థాయిలో యాంత్రీకరణ ఫలితాలు రైతులకు సక్రమంగా అందితే వ్యవసాయ రంగం కూడా ఆర్థికానికి చోదక శక్తి అవుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం రైతుల కు ఉచితంగా విద్యుత్తు అందించడం, రుణ మాఫీ అమలు చేయడం, సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, చివరకు రైతులు ఏ కారణాలతోనైనా చనిపోతే వారికి రైతు బీమాను నూటికి నూరు శాతం అమలు చేయడం వ్యవసాయానికి ఊతంగా చెప్పవచ్చు.