ఇన్‌చార్జి బిషప్‌గా డోర్నకల్ బిషప్ పద్మారావుకు బాధ్యతలు
సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంలో రేపు బాధ్యతల స్వీకారం
చర్చి అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలే కారణం
మెదక్ : దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్‌ఐ చర్చి (మహా దేవాలయం) బిషప్ సాల్మన్‌రాజ్‌ను చర్చి బాధ్యతల నుంచి సస్పెండ్ తప్పించారు. ఈ మేరకు సినాడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. చర్చిలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వివిధ సంఘటనలు, అభివృద్ధి కమిటీ ఎన్నికల దరిమిలా పలు రకాల ఆరోపణల వచ్చిన నేపథ్యంలో సాల్మన్‌రాజ్‌ను సినాడ్ సస్పెండ్ చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత నెల రోజులుగా మెదక్ సిఎస్‌ఐ చర్చిలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం బిషప్ సస్పెండ్ అయ్యారు.
అతని స్థానంలో ఇన్‌చార్జి బిషప్‌గా డోర్నకల్ బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు సినాడ్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈనెల రెండో తేదీన జరిగిన మెదక్ చర్చి అభివృద్ధి కమిటీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనల కారణంగానే సాల్మన్‌రాజ్ సస్పెన్షన్‌కు దారితీసిందని సిఎస్‌ఐ వర్గాలు చెబుతున్నాయి. చర్చి కమిటీ ఎన్నికల్లో మొత్తం 18స్థానాలకు ఎన్నిక జరగ్గా, అందులో మెజార్టీ స్థానాలు సాల్మన్‌రాజ్ ప్రత్యర్థివర్గం ప్యానలే గెలుచుకుంది. ఈ తరుణంలో బిషప్‌గా తన పరిధిలో నియామకం చేసే తొమ్మిది స్థానాల్లో మైనార్టీ ప్యానెల్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎంపిక చేసి మద్దతు ఇచ్చారు.
అప్పటి నుంచి సిఎస్‌ఐలో ఈ విషయంపై నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూ వచ్చింది. ఇటీవల ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన బిషప్ సాల్మన్‌రాజ్ తనపై తమ సభ్యులే దాడికి దిగారని విలేకరుల సమావేశంలో బహిరంగంగా ప్రకటన చేశారు. ప్రత్యర్థి వర్గం వారు తనను అంతమొందించేందుకు కావాలనే కత్తితో దాడి చేశారని బిషప్ ఆరోపణలు చేస్తూ పోలీసుల ఫిర్యాదు చేసి, 18 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.
ఈ విషయం పూర్తిగా విచారణ చేపట్టిన సినాడ్ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఒక ప్రత్యేక కమిటీ ద్వారి విచారణ జరిపించి బిషప్ సాల్మన్‌రాజుపై వచ్చిన ఆరోపణలను ధృవీకరించుకుని ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో తరుచూ సిఎస్‌ఐలో జరుగుతున్న రాజకీయ రాద్దాంతంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారంటూ.. ఇకనైనా పాలకవర్గం సరిగ్గా పనిచేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్‌ఐ చర్చి విలువలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.