Sunday, December 22, 2024

మెతుకుసీమలో గెలుపు వీరుడెవరో

- Advertisement -
- Advertisement -

బిసి వాదంతో కాంగ్రెస్… మోడీ చరిష్మాతో బిజెపి దూకుడు
కెసిఆర్, హరీశ్‌కు సవాల్‌గా మారిన ఎంపి స్థానం
ముక్కోణపు పోటీలో నిలిచేదెవరు?

యస్.ఎన్.చారి, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ సత్తా చాటేందుకు కాం గ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రతిరోజు కార్యకర్తలతోపాటు, ప్రజలతో సమావేశా లు నిర్వహిస్తూ బిజీబిజీ అయ్యాయి. దివంగత మాజీ ప్రధా ని ఇందిరాగాంధీ ఈ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామన్న కాంగ్రెస్ ఈ స్థానంపై గట్టి ఫోకస్ చేసింది. ఎలాగైనా మెదక్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపికలో కూడా జాతీయ స్థాయిలో సుదీర్ఘ చర్చల అనంతరం బిసి వర్గానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన నీలం మధుకు సీటు కేటాయించింది.

ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉం డగా మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 18 లక్షల 19 వేల ఓట్లకు పైచిలుకు ఓటర్లు ఉండగా వీటిలో ఆరు నుంచి ఏడు లక్షల ఓట్లు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవి. ఇది కాంగ్రెస్‌కు కలిసివస్తుందని హైకమాండ్ భావించి అభ్యర్థిని ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రం లో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తమకు మరింత బలాన్ని చేకూర్చే అంశంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మెదక్ తప్ప మిగిలిన ఆరు స్థానాలను బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

అయినప్పటికీ ఎలాగైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు విస్తృత ప్రచారాలను నిర్వహిస్తోంది. ఈ పార్లమెంట్ స్థానంలో గెలుపు బాధ్యత మంత్రి కొండా సురేఖకు అప్పగించింది ఆ పార్టీ. ఇప్పటికే ఏడు సెగ్మెంట్లలోని చాలా మంది మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మున్సిపల్ చైర్మన్‌లు గులాబీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ జోరు మీదుంది. ఇదే జోరును ఎన్నికల వర కు కొనసాగిస్తూ ఓటర్లను హస్తం గుర్తు కు ఓటు వేసే దిశగా ఆ పార్టీ పక్కా వ్యూహరచనతో ముందుకు కొనసాగుతోంది.

ఎన్నిక ఏకపక్షమే: బిజెపి

దేశంలో మోడీ చరిష్మా బి జెపి గెలుపునకు బాటలు వేస్తుంద ని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు ధీ మా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందు బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందన్‌రావును ప్రకటించడంతో ఆ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతోం ది. బిఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ షిప్ లాంటిదని, ఆ పార్టీతో అసలు పోటే లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని, అతనిని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ప్రచారం కొనసాగిస్త్తోంది. కాలు మొక్కినోళ్లు, మోసగాళ్లు, ప్రజానాయకులు కాలేరని, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులే ప్రజాక్షేత్రంలో చిరస్థాయిగా నిలిచిపోతారనే వాదాన్ని రఘునందన్‌రావు బలంగా నమ్ముతున్నట్లు ప్రతి సందర్భంలో వివరిస్తూ ముందుకెళ్తున్నారు.

బిజెపి దేశంలో 400 స్థానాలతోపాటు మెదక్‌ను కూ డా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ప్రభు త్వం వైఫల్యం చెందిందం టూ ప్రచారాలు జరుపు తూ ఇందిరాగాంధీ హ యాం నుంచి ఇప్పటివర కు ఈ ప్రాంతంలో కాంగ్రె స్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గడిచిన పది సంవత్సరాలలో మోడీ హయాంలోనే జాతీయ రహదారులు, రైల్వేలైన్‌లతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఈసారి కూడా మోడీ వాదంతో ప్రజలు బిజెపి వైపే ఉన్నారని ధీమాలో ఉన్నారు.

ఎలాగైనా మెదక్‌లో గులాబీ జెండా ఎగురవేస్తాం : బిఆర్‌ఎస్

పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ఆరు స్థానాల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గెలవడంతో గులాబీ పార్టీ తమకు కలిసివచ్చే ఆంశంగా భావిస్తోంది. అందులో మాజీ సిఎం కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, ట్రబుల్ షూటర్ హరీష్‌రావు నియోజకవర్గమైన సిద్దిపేట ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో బిఆర్‌ఎస్ ఇక్కడ గెలుపును ఛాలెంజ్‌గా తీసుకుంది. ఎన్నో ఎన్నికల్లో ఓటమి ఎరగని మామా అల్లుళ్లయిన కెసిఆర్, హరీష్‌లకు ఈ స్థానం గెలవడం సవాల్‌గా మారింది. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసి, విఆర్‌ఎస్ పొంది గులాబీ పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నాన మెదక్, సంగారెడ్డి జిల్లాల ఇన్‌ఛార్జీ కలెక్టర్‌గా కూడా వెంకట్రామిరెడ్డి పనిచేయడంతో స్థానికంగా ప్రజాసమస్యలు పూర్తిస్థాయిలో తమ పార్టీ అభ్యర్థ్డికి తెలుసని ఇక్కడి ప్రాంతం గోడును కేంద్రానికి వినిపించేలా తమ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజు మాజీ మంత్రి హరీష్‌రావు దాదాపు ఒకటి నుంచి రెండు నియోజకవర్గాల్లో కిందిస్థాయి కార్యకర్తలతోపాటు ముఖ్య నాయకులను కలుపుకొని సమావేశాలు నిర్వహించి ఎలాగైనా గెలుపు కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు బిఆర్‌ఎస్ మెదక్ సీటును కైవసం చేసుకుందని, ఈసారి కూడా ఈ సీటు తమదేనని ధీమాతో ఆ పార్టీ ముందుకు కొనసాగుతోంది. మొత్తానికి మూడు పార్టీలు ఈ స్థానం కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మెతుకుసీమ ప్రజలకు ముందు నుంచి ఉద్యమస్ఫూర్తి, చైతన్యవంతులుగా పేరుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని తమ ప్రతినిధిగా లోక్‌సభకు పంపిస్తారో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News