హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్(37) మృతిపై హైకోర్టు స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డిజిపి, మెదక్ ఎస్‌పి, డిఎస్‌పి, ఎస్‌హెచ్‌ఒను ప్రతివాదులుగా చేర్చింది. పోలీసులు దెబ్బలకు తట్టుకోలేకనే మెదక్‌కు చెందిన ఖదీర్ ఖాన్ మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
ఓ గొలుసుచోరీ కేసులో అనుమానంతో మెదక్ పట్టణ ఠాణా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేయగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో ఖదీర్ మృతిచెందినట్లు ఆయన భార్య సిద్ధేశ్వరి వెల్లడించిన విషయం తెలిసిందే. అయిదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం.. తర్వాత నేరం చేయలేదని వదిలిపెట్టడం.. అతడు ఆసుపత్రికి వెళ్తే తమ నిర్వాకం బహిర్గతమవుతుందని ఇంట్లోనే ఉండి మందుబిళ్లలు వేసుకోవాలని చెప్పడం… ఎట్టకేలకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చివరకు ప్రాణాలు కోల్పోవడం ఈ ఉదంతంలో ప్రచారంలోకి వచ్చిన కీలకాంశాలు. దీనిని సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది.