మెదక్: ఈ నెల 24వ తేదీన మహిళ గొంతుకోసి హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడు కౌశిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం ప్రియదర్శిని మీడియాతో మాట్లాడారు. పట్టణం కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే మృతురాలు సుజాత ప్రతి రోజు మాదిరిగానే ఈ నెల 24వ తేదీన కూరగాయల దుకాణం నుంచి ఇంటికి వంట చేయడానికి వచ్చింది.
సుజాతను ఎప్పటి నుంచో హంతకుడు కౌషిక్ గమనిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న సుజాత ఇంట్లో ప్రవేశించి దారుణంగా హత్య చేసి మెడలో ఉన్న బంగారు పుస్తేల తాడు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయాడు. ప్రతి రోజు పెద్ద బజార్ లో వేల సంఖ్యలో ప్రజలు తిరుగుతారు, ఎవరికి అనుమానం రాకుండా హత్య చేసిన తీరు పోలీసులకు కూడ అంతు చిక్కలేదు. కేసును ఛేదించడాని పోలీసులకు వారం రోజుల సమయం పట్టిందన్నారు.
హత్య జరిగిన విషయం హంతకుని తల్లి తండ్రులు బయట పెట్టారు. తన కుమారుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదన్నారు. నిందితున్ని విచారించగా మరో మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇంటి పక్కనే ఉన్న వృద్ధురాలిని కూడా నగల కోసమే హతమార్చానని ఒప్పుకున్నాడు. గతంలో రెండు చోరీలు కూడా చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై ఉన్న బంగారు ఆభరణాలే టార్గెట్ గా హత్యలు, దొంగతనాలు జరిగాయని పోలీసులు వెల్లడించారు. 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎదురు తిరిగితే హత్యలు చేయడమే కౌశిక్ పని గా పెట్టుకున్నాడని ఎస్పి తెలిపారు