ఇద్దరికి రాష్ట్రపతి, 11మందికి సేవా పురస్కారాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో విధినిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన 13 మంది పోలీసులకు పతకాలు ప్రకటించారు. ఈక్రమంలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు రాగా 11 మందికి పోలీసు సేవా పతకాలు వచ్చాయి. చాకో సన్నీ, శ్రీనివాసరాజులు రాష్ట్రపతి పోలీసు పతకాలు కైవసం చేసుకున్నారు. చాకో సన్నీ ఇబ్రహీంపట్నం టిఎస్‌ఎస్‌పి బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా శ్రీనివాసరాజు పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా దేశవ్యాప్తంగా 993 మందికి పతకాలు ప్రకటించగా రాష్ట్రానికి 13 పతకాలు దక్కాయి.
విశిష్ట సేవా పతకాలు
మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసిం, సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డిసిపి ఎస్.రవికుమార్, భూపాలపల్లి అదనపు ఎస్‌పి పి.శోభన్ కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్‌పి ఆర్.సుదర్శన్, ఐఎస్ డబ్ల్యూ డిఎస్‌పి పి.శ్రీనివాసరావు, ఐటి అండ్ సిడిఎస్‌పి జి.శ్రీనివాసులు, వనపర్తి డిఎస్‌పి కె.ఎం.కిరణ్ కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్‌ఎస్‌ఐ యాకూబ్ ఖాన్,డిచ్‌పల్లి టిఎస్‌ఎస్‌పి ఎఆర్‌ఎస్‌ఐ బి.సత్యం, గ్రేహౌండ్స్ ఎఆర్‌ఎస్‌ఐ ఎం.వెంకటరమణా రెడ్డి, కొండాపూర్ టిఎస్‌ఎస్‌పి హెడ్‌కానిస్టేబుల్ ఐ.కోటేశ్వరరావులకు విశిష్ట సేవా పతకాలు వరించాయి. అలాగే జైళ్లశాఖలో ముగ్గురికి కరెక్షనల్ సర్వీసు పతకాలు లభించాయి. చీఫ్ హెడ్ వార్డర్ ఎం.పంతు,హెడ్ వార్డర్ గంటా రత్నారావు,హెడ్ వార్డర్ బి.నర్సింగ్ రావులు పతకాలు అందుకోనున్నారు. అలాగే సర్థార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ పోలీసులకు రెండు పతకాలు లభించాయి. అసిస్టెంట్ కమాండర్ భుపేందర్‌కుమార్ కానిస్టేబుల్ బాసుమతిరి అజయ్‌లు పురస్కారాలు అందుకోనున్నారు. అదేవిధంగా సికిందరాబాద్ రైల్వే ఇన్సెక్టర్ నరసింహ పోలీసు సేవా పతకం దక్కించుకున్నారు.