Sunday, December 22, 2024

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి : మేడారంలో 2024లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘ శుద్ద పౌర్ణమి గడియలను ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం మేడారంలోని ఎండోన్‌మెంట్ కార్యాలయంలో పూజారులు, పుర ప్రజలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 21వ తేదీన కన్నెపల్లి నుండి సారలమ్మ,

పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారని, ఫిబ్రవరి 22వ తేదీ గురువారం చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 23వ తేదీన వన దేవతలకు మొక్కులు చెల్లింపులు, ఫిబ్రవరి 24వ తేదీన తల్లుల ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. 2018లో జరిగిన జాతరకు సంబంధించి తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించామని, కానీ అనివార్య కారణాల రీత్యా 2024 జాతర తేదీలను 9 నెలల ముందుగానే ప్రకటించే అనివార్యత ఏర్పడిందని అన్నారు.

అర్చక భవన్ వెంటనే నిర్మించాలి
వనదేవతలకు జీవితకాలం సేవ చేస్తున్న మేడారం పూజారులకు దేవాదాయశాఖ వెంటనే అర్చకభవన్ నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోజంతా వనదేవతల సన్నిధిలో గడిపే పూజారులకు, వారి దైనందిన కార్యక్రమాలకు ఒక కార్యాలయం అవసరమని అన్నారు. తమ పూర్వికుల నుండి తరతరాలుగా తల్లులకు సేవ చేస్తున్న తమకు హక్కులుంటాయని, వాటిని ప్రభుత్వం గుర్తించి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

దేవాదాయశాఖ ఉద్యోగులు స్థానికంగా ఉండేలా చర్యలు చేపట్టాలి
నిత్యం వేలాది మంది భక్తులతో బాసిల్లుతున్న దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారంలో భక్తులకు సౌకర్యార్థం స్థానికంగా ఆలయ అధికారులు, ఉద్యోగులు ఉండేలా దేవాదాయశాఖ సత్వరమే చర్యలు చేపట్టాలని పూజారుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రంలోని అతి పెద్ద జాతరకు ప్రభుత్వం జనరల్ ఫండ్ నుండి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి, లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ముందే వసతుల ఏర్పాట్లు చేయాలని, రూ. 200కోట్ల నుండి తగ్గిస్తూ రూ. 70కోట్లకు తెచ్చిన మహాజాతర బడ్జెట్‌ను పునరుద్దరించాలని జగ్గారావు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు చందా గోపాల్, ప్రధాన కార్యదర్శి కాక సారయ్య, పూజారులు సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన మహేష్, లక్ష్మణరావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేష్, బోజారావు జనార్థన్, అరుణకుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News