Sunday, December 22, 2024

మేడారం జాతరకు తండోపతండాలుగా భక్తులు

- Advertisement -
- Advertisement -

వనదేవతల జాతరకు అంతా సిద్ధం
ఏటికేడు పెరుగుతున్న భక్తులు..
జాతరకు కోటిన్నర భక్తుల రాక అంచనా…
ఎనిమిది రాష్ట్రాలనుండి పోటెత్తనున్న భక్తులు….
పైసా లేకుండా ఆర్టీసి సేవలు….
వరంగల్ కు ప్రత్యేక రైళ్లు……

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ఆసియాఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం వన దేవతల మహా జాతరకు అంతాసిద్ధమయ్యింది. మేడారం జాతరకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఈసంవత్సరం సుమారు కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అంచనావేస్తున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996 సంవత్సరంలో రాష్ట్ర పండగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర వస్తుందంటే చాలు ఆదివాసీ గ్రామం అయిన మేడారం జనారణ్యంగా మారిపోతుంది.

Medaram jatara

దేశవిదేశాల్లో భక్తులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో ఇక్కడకు వచ్చి ఎత్తు బంగారం, పూలు, చీర, సారలతో దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. గత రెండు నెలలముందునుండి మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈనెల 21 నుండి 24 వరకు జరిగే జాతరకు గతంలో కంటె ఎక్కువ మొత్తంలో భక్తులు వస్తారని అధికార వర్గం అంచనా వేస్తుంది. మేడారం మహాజాతరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, జార్జండ్, ఒడిశా, అస్సాం, మధ్యప్రదేశ్, రాష్ట్రాలనుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దాదాపు ఎనిమిది రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తనున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగతూ వస్తోంది. కాకతీయుల రాజులతో పోరాటం చేసిన వీరవనితలు సమ్మక్క, సారలమ్మల జాతరకు సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. 1940 సంవత్సరంలో చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. భక్తుల సంఖ్యలక్షలలోకి చేరుకోవడంతో ప్రభుత్వాలు దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో జరిపుకునేలా ప్రారంభించారు.

సమ్మక్క, సారలమ్మల చరిత్ర బయ్యక్కపేట నుండి మొదలు…

సమ్మక్క పుట్టిన ఊరుగా చరిత్ర పాశస్త్రంలో ఉన్న బయ్యక్కపేట లోనే పూర్వకాలం నుండి గుడిఉంది. ఇక్కడ చందా వంశస్తులు నిత్య పూజలు నిర్వహిస్తారు. బయ్యక్కపేట పూజారులు చూపుతున్న ఆధారాలను బట్టి పూర్వం బయ్యక్కపేట లోనే సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించేవారు. చందా వంశీయులే ఇక్కడ తలపతులుగా వ్యవహరిస్తారు. జాతరను జరిపే చందావంశస్తులు ఈ చుట్టుపక్కల కోయగూడెలలోనే ఉన్నారు. బయ్యక్కపేటలో కరువుకాటకాలవల్ల జాతరను నిర్వహించే శక్తిసన్నగిల్లడం వలన సమ్మక్క, సారలమ్మ జాతరను బయ్యక్కపేటనుండి మేడారానికి మార్చారు. ఈ క్రమంలో వారు రాసుకున్న ఒప్పందాల మేరు చందా వంశీయులు మేడారం జాతర హుండీ ఆదాయంలో వాటా పొందుతున్నారు.

పైసా ఖర్చులేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర….

గత ప్రభుత్వాలు మేడారం జాతరకు ఆర్టీసి ద్వారా భక్తులను చేరవేయడానికి సమాయత్తం అయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడగా సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. తెలంగాణ ఆర్టీసి గతంలో కంటె అధికంగా ఈసారి 6వేల బస్సులను నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళ భక్తులు పైసా ఖర్చులేకుండా మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని వెళ్లవచ్చు.

మేడారం జాతరకు 30 జన్ సాధన్ ప్రత్యేక రైళ్లు…

దక్షిణ మధ్య రైల్వే శాఖ మేడారం మహాజాతర ఈనెల 21 నుండి 24 వరకు సికింద్రబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలనుండి 30 రైళ్లను వరంగల్ కు నడపనున్నట్లు తెలిపింది. వివిధ జిల్లాలనుండి మేడారం జాతరకు వచ్చే భక్తులు రైలుమార్గం ద్వారా వరంగల్ కు చేరుకుని అక్కడి నుండి ఆర్టీసి బస్సులలో మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మ ల దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక రైళ్లు నడుతుపుతున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News