గాజాపై క్షిపణి దాడులు.. పదిమంది మృతి
కుప్పకూలిన 12 అంతస్థుల మీడియా భవనం
గాజా: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు శనివారం కూడా కొనసాగాయి. ఉదయం జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది చనిపోయారు. వారిలో ఎక్కువగా చిన్నారులేనని అక్కడి మీడియా వెల్లడించింది. గాజాలో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరంపై ఈ వైమానిక దాడి జరిగిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ జరిపిన మరో క్షిపణి దాడిలో 12 అంతస్థుల మీడియా భవనం కుప్పకూలింది. అందులో అంతర్జాతీయ మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్, అల్‌జజీరాసహా పలు సంస్థల కార్యాలయాలున్నాయి. దాడికి గంట ముందే భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో, అందులోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
మీడియా భవనాన్ని ఎందుకు కూల్చారన్న దానిపై ఇజ్రాయెల్ నుంచి వివరణ రాలేదు. అయితే, ఆ ప్రాంతంలో జరుగుతున్న హింసపై బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడానికే దాడి జరిపినట్టుగా విమర్శలొస్తున్నాయి. శుక్రవారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో నిరసన తెలుపుతున్న పాలస్తీనీయన్లపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో పదిమంది చనిపోయారు. మరోవైపు శనివారం పాలస్థీనీయన్లు నక్బాదేను పాటించారు. ప్రతియేటా మే 15ను నక్బాడేగా పాలస్తీనీయన్లు పాటిస్తారు. తమను సొంత ప్రాంతం నుంచి యూదులు తరిమి కొట్టారని గుర్తు చేయడం కోసం ఆ రోజున నిరసన కార్యక్రమాలు చేపడ్తారు. 1948లో యూదుల కోసం ఓ ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆ ప్రాంతం నుంచి ఏడు లక్షలమంది అరబ్బులను తరిమికొట్టినట్టు చెబుతారు.
Media Building collapse after Israel Airstrikes in Gaza