పాత్రికేయం- ప్రమాణాలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో మాట్లాడిన మాటలు విమర్శలకు దారితీసాయి. కొందరు యూట్యూబర్లు ప్రసారం చేసిన ఒక వార్తను దృష్టిలో పెట్టుకొని ఆయన జర్నలిస్టులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ‘మీడియా మిత్రులను, జర్నలిస్టుల సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులు ఎవ్వరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి నిర్వచనం చెప్పండి. లిస్టులో ఉన్నవాళ్లు తప్పు చేస్తే మీరు ఏ శిక్ష విధిస్తారో చెప్పండి. లిస్టులో లేనివారు జర్నలిస్టులు కాదు. వారికి ఎలా జవాబు చెప్పాలో అలా చెబుతా’ అని ముఖ్యమంత్రి అనడం సబబు కాదు. జర్నలిస్టు అనే పదానికి మన రాజ్యాంగం నిర్వచనం చెప్పింది. అంతేకాదు, గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల సభ్యుల జాబితాను ఏటా లేబర్ కమిషనర్‌కు ఇస్తారు. రాష్ట్ర సమాచార శాఖ ఇచ్చే గుర్తింపు (అక్రిడిటేషన్) ద్వారా జర్నలిస్టుల సంఖ్య కూడా తెలుస్తుంది. కొంతమంది జర్నలిస్టులకు గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకొని జర్నలిస్టుల సంఖ్యను బేరీజు వేసుకోవచ్చు.
జర్నలిస్టులు పలు రకాలుగా ఉంటారు. వెటరన్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు, ప్రింట్ మీడియా జర్నలిస్టు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, డిజిటల్ మీడియా జర్నలిస్టు, వీడియో జర్నలిస్టు, ఫోటో జర్నలిస్టులతోపాటు సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇంచార్జిలు, న్యూస్ ఎడిటర్లు, కార్టూనిస్టులు కూడా జర్నలిస్టులే. ప్రింట్ మీడియాకు తోడు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా,డిజిటల్ మీడియా కూడా వచ్చాయి. యాజమాన్యాలు ఇబ్బడిముబ్బడిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం వలన జర్నలిస్టుల విలువ తగ్గింది. కొన్ని యాజమాన్యాలు కొత్తగా నియమితులైన విలేకరులకు శిక్షణ ఇవ్వడం వలన జిల్లాస్థాయి విలేకరులు నైతిక విలువలతో పనిచేస్తున్నారు.
విలేకరులకు కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులను దాటి వార్తలు రాస్తే శిక్ష అనుభవించవలసి ఉంటుందని గుర్తెరగాలి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నాయకులే తయారు చేసిన జర్నలిస్టులు ఉన్నారు. పెయిడ్ జర్నలిస్టులు ఉంటారు. వారు రేటు కట్టి మరీ వార్తలు రాస్తారు. అవసరం వచ్చినప్పుడు ఆ విలేకరులను రాజకీయ నాయకులే వాడుకుంటారు. ఇక ఆయా పార్టీలకు గొడుగు పట్టే జర్నలిస్టులు ఉన్నారు. వారిని పోషించేది కూడా రాజకీయ నాయకులే. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు పట్టుకొని దందాలు, బ్లాక్ మెయిల్ చేసే జర్నస్టులు కూడా లేకపోలేదు.
ఇక సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రతి పార్టీకి వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. వారిలో కొందరికి ప్రతిరోజూ ఎదుటి పార్టీని ఏదో ఒక విధంగా విమర్శించడమే వారి పని.
వీళ్లందరినీ పెంచి పెద్ద చేసింది రాజకీయ పార్టీలే. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, విపక్షంలో ఉన్నప్పుడు మరొక మాదిరిగా రాజకీయ పార్టీలు ఉండడం వల్ల జర్నలిస్టుల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. యాజమాన్యాలు ప్రకటనలు తీసుకురావాలంటూ టార్గెట్ పెట్టడం వలన విలేకరులు పక్కదారి పడుతున్నారు. సోషల్ మీడియాలో పనిచేసే వారికి స్వీయ నియంత్రణ లేకపోవడం వలన అనర్థాలకు దారితీస్తోంది. వీటిని నిరోధించడానికి మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జర్నలిస్టు సంఘాలు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయినా అటు కేంద్ర ప్రభుత్వం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాని మీడియా కమిషన్ ఏర్పాటుపై మాట్లాడటం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వాఖ్యలపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. వీటిన్నంటినీ దృష్టిలో పెట్టుకొని మేధావులు, బుద్ధిజీవులు, న్యాయవాదులు, సామాజికవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీడియా కమిషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలి.
దాసరి క్రిష్ణారెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్)