Monday, December 23, 2024

యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు

- Advertisement -
- Advertisement -

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మన దేశంతో సహా అన్ని చోట్లా అది కనిపిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు పిడుగు ఏక్షణంలో పడుతుందో తెలియదు. తమ దగ్గర చిక్కుకు పోయిన లేదా ఉక్రెయిన్ బందీలుగా చేసిన భారత్, ఇతర దేశాల విద్యార్ధుల భవిష్యత్ గురించి తలిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఇక ఈ ఈ యుద్ధం గురించి మీడియా తీరుతెన్నులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

ప్రపంచ చట్టాలను, భద్రతా మండలి తీర్మానాన్ని లెక్కచేయటం లేదంటూ రష్యాను దోషిగా చూపుతూ ప్రచారం జరుగుతోంది.1995లో తొలిసారిగా నాటోకూటమి యుగ్లోసావియా మీద మార్చి నెల 24 నుంచి జూన్ 10 వరకు 78 రోజుల పాటు వైమానిక దాడులు జరిపింది. దీనికి భద్రతా మండలి అనుమతి లేదు. అప్పుడు దాడికి దిగిన “ఐరోపా అపర ప్రజాస్వామిక దేశాలు”, వాటికి మద్దతు పలికిన మీడియాకు అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామిక సూత్రాలు గుర్తుకురాలేదు. కొసావోలో ఉన్న పరిస్ధితులు ప్రాంతీయ స్ధిరత్వానికి ముప్పు వచ్చిందని నాటో సమర్ధించుకుంది. దానికి మీడియా తానతందానా అంది.అదే నిజమైతే ఇప్పటి మాదిరి ఐరాసలో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు ఉక్రెయినుకు నాటో సభ్యత్వం ఇచ్చే చర్యలు తన భద్రతకు, ప్రాంత దేశాలకు ముప్పు అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న రష్యా అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు? ఉక్రెయిన్‌లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌బాస్ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న రష్యన్ భాష మాట్లాడేవారిపై కిరాయి ఫాసిస్టు మూకలు, మిలిటరీ జరిపిన దాడులతో 15,000 మంది మరణించటం, 8 సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధం, జర్మనీ, ఫ్రాన్స్ కుదిర్చిన రెండవ మిన్‌స్క్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉక్రెయిన్ ప్రభుత్వ తీరుతెన్నులు ఆ ప్రాంతంలో అస్ధిరతకు దారి తీయవా? నాటో ఎందుకు పట్టించుకోలేదు?పశ్చిమ దేశాలు ఇరాక్, లిబియా, సిరియా, ఎమెన్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాలపై దాడులు జరిపాయి.

ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుపుతోంది. రెండు ఉదంతాలపై మీడియా స్పందించిన తీరేమిటి? సిబిఎస్ అనే అమెరికా మీడియా కీవ్ నగర విలేకరి చార్లీ డి అగటా చెప్పిన వార్తలో “ఈ ప్రాంతం దశాబ్దాల తరబడి విభేదాలు చెలరేగుతున్న ఇరాక్, అఫ్ఘానిస్తాన్ వంటిది కాదు, ఇది వాటితో పోలిస్తే నాగరికమైన ప్రాంతం, ఐరోపాకు చెందినది, ఈ నగరంలో యుద్ధం జరుగుతుందని మీరు ఊహించలేరు..” అన్నాడు. అంటే పైన పేర్కొన్న ప్రాంతాలు అనాగరికమైనవన్న శ్వేతజాతి జాత్యహంకారం తప్ప ఆ మాల్లో మరేమైనా ఉందా? అమెరికా, ఐరోపా వంటి నాగరిక దేశాలు అనాగరికంగా ఇతర దేశాలమీద దాడులకు దిగటం ఏమిటి? పశ్చిమ దేశాల్లోని జనాలు అడవుల్లో ఉంటూ సరిగా బట్టలు కట్టుకోవటం కూడా రాని కాలంలోనే ఇరాక్ వంటి దేశాలు నాగరికతను కలిగి ఉన్నాయి. అనేక గణిత, సైన్సు అంశాలను బోధించాయి.

మరో అమెరికా మీడియా ఎన్‌బిఎస్ విలేకరి హాలీ కోబిలే ఒక మహిళ అని కూడా మరచి మరింత దారుణంగా మాట్లాడింది. “మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సిరియా నుంచి వచ్చిన నిర్వాసితులు కాదు, ఉక్రెయిన్ వారు. వారు క్రైస్తవులు, వారు తెల్లవారు, మన మాదిరే ఉంటారు.” అంటే సిరియన్లు, ఇతరులు ఏమైనా వారికి ఫరవాలేదన్నమాట. బిబిసిలో ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ “ నీలి కళ్లు, తెలుపు, రాగి రంగు జుట్టుకల ఐరోపా వారిని చంపుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను” అన్నాడు. మరొక యాంకర్ పీటర్ డోబీ మాట్లాడుతూ “వారి దుస్తులను చూస్తుంటే వారంతా ధనికులు, మధ్యతరగతి వారిలా ఉన్నారు తప్ప మధ్యప్రాచ్యం, లేదా ఉత్తరాఫ్రికా నుంచి పారిపోతున్న కాందిశీకుల్లా మాత్రం లేరు. మీ పక్కింటి యురోపియన్ వారిలానే ఉన్నారు”.పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జరిగిన యుద్ధాలకు పాల్పడిందీ, ప్రపంచాన్ని ఆక్రమించింది ఐరోపా సామ్రాజ్యవాదులే కదా! బ్రిటన్ టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్టు డేనియన్ హానన్ ఉక్రెయిన్ పరిస్ధితిని చూసి దిగ్భ్రాంతి చెందాడట.

ఎందుకటా అది ఐరోపా దేశమట. నిజమే రెండు ప్రపంచ యుద్ధాలను ప్రారంభించిందీ, అంతకు ముందు ఐరోపాలో, అమెరికాలో కొట్టుకుచచ్చిందీ, యుద్ధాలకు పాల్పడిందీ, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నదీ “ఐరోపా నాగరికులే” అని మర్చిపోతే ఎలా, అందుకే తమ కింత ఉన్న పెద్ద మచ్చను ఒకసారి చూసుకోమని చెప్పాల్సివస్తోంది. ఐదు లక్షల మంది ఉక్రెయినియన్లు నిర్వాసితులుగా మారటం, ఇతర దేశాలకు పోవటం దురదృష్టకరమని ఐరాస అధికారి ఫిలిప్పో వాపోయారు. 1948 నుంచి తమ మాతృదేశం నుంచి వెళ్లగొట్టిన కారణంగా ఏడున్నర లక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 56 లక్షలకు చేరిన పాలస్తీనియన్లు అప్పటి నుంచి పరాయిప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కాందిశీకుల శిబిరాల్లోనే పుట్టి కాందిశీకులుగా అక్కడే మరణించిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు. పిల్లలకు దాడుల భయం తప్ప మరొకటి తెలియదు. వారి గురించి నాగరికులకు పట్టదు, దానికి కారణమైన ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్నారు. 2019 నాటికి 7.95 కోట్ల మంది ప్రపంచంలో నిరాశ్రయులు కాగా వారిలో 2.04 కోట్ల మంది 18 ఏండ్ల లోపువారున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులెవరు అంటే 99 శాతం ఐరోపా, అమెరికా అనాగరికులే.

ఉక్రెయిన్‌లో రష్యన్ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి కథ కథలుగా చెబుతున్న పశ్చిమ దేశాల మీడియా ఎన్నడైనా పాలస్తీనియన్లు, వియత్నాం తదితర చోట్ల సామాన్యులు చూపిన తెగువ, అమెరికన్లను మూడు చెరువుల నీళ్లు తాగించి సలాంకొట్టించిన ఉదంతాలను ఎప్పుడైనా చెప్పిందా? అంతెందుకు, మమ్మల్ని ప్రాణాలతో వెళ్లిపోనివ్వండ్రా బాబూ అని అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికన్లు పారిపోకముందు వరకు వారిని అణచివేశామనే కట్టుకథలనే ప్రపంచానికి వినిపించిన సంగతి మరచిపోగలమా! ఉక్రెయిన్లో బాంబులు తయారుచేసి ఉపయోగించి చూపటాన్ని దేశభక్తిగా చూపుతున్న మీడియా పాలస్తీనాలో అదేపని చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచివేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు,మోసకారితనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అఫ్ఘానిస్తాన్ తాలిబాన్లు అమెరికా సిఎన్‌ఎన్ విలేకరి బెర్నీ గోరెస్‌ను ఉరితీసి చంపారని గతంలో ప్రపంచాన్ని నమ్మించారు.

ఇప్పుడు అదే బెర్నీ ఉక్రెయిన్లో దర్శనమిచ్చి పిట్ట, కట్టుకథలను రాసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు శక్తివంచనలేకుండా పని చేస్తున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎమెన్‌పై దాడులు చేస్తున్న సౌదీ అరేబియా, ఇతర దేశాల దాడుల్లో 80వేల మంది పిల్లలతో సహా ఐదు లక్షల మంది మరణిస్తే ఐరోపా మానవతావాదులు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు చీమకుట్టినట్లుగా లేదు. రష్యన్ల ఆస్తులను స్తంభింపచేయాలని నిర్ణయించిన “నాగరికులు” సౌదీ అరేబియా, ఇతర దేశాల మీద అలాంటి చర్యలెందుకు తీసుకోలేదు. బ్రిటన్‌లో అది రెండు ఫుట్‌బాల్ క్లబ్బులను నడుపుతోంది. భద్రతా మండలిలో తటస్ధంగా ఉన్న యుఏయి బ్రిటన్‌లో అత్యంత ధనవంతమైన మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ భాగస్వామి, ఉక్రెయిన్‌పై బాంబుదాడులను నిరసిస్తూ సదరు క్లబ్బులో సభ నిర్వహించింది. దాని తటస్ధత ఎక్కడ? రష్యన్లు ఉక్రెయిన్ తరువాత మిగతా దేశాలను కూడా ఆక్రమించుకుంటారు అని అమెరికా,ఐరోపా దేశాలన్నీ ఊదరగొడుతున్నాయి. ఐరాస తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనా ప్రాంతాలను గత ఏడు దశాబ్దాలుగా ఆక్రమించుకొని స్ధిరపడాలని చూస్తున్న ఇజ్రాయల్‌కు అవి తిరుగులేని మద్దతు ఇస్తున్నాయి. ఉక్రేనియన్లు తమ దేశం వెళ్లి పోరాడేందుకు అన్ని రకాల సాయం చేస్తామని బ్రిటీష్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ప్రకటించారు.కానీ అదే బ్రిటన్ పశ్చిమాసియాకు చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రించి జైళ్లలో పెట్టింది. ఫుట్‌బాల్ స్టేడియాల వద్ద పాలస్తీనా పతాకాలను ఎగురవేయటాన్ని బ్రిటన్ నిషేధించింది, ఎందుకంటే క్రీడలకు రాజకీయాలకు ముడిపెట్టకూడదని చెప్పింది, అదే ఇప్పుడు ఉక్రెయిన్ పతాకాలను ఎగురవేయిస్తున్నది. అమెరికాతో కలసి తనకు సంబంధం లేకపోయినా అనేక దేశాల మీద దాడులకు దిగిన బ్రిటన్ ఇప్పుడు రష్యాను చూపి గుండెలు బాదుకుంటోంది.

పశ్చిమ దేశాల మీడియా పోకడలను అమెరికాలోని అరబ్, మధ్యప్రాచ్య దేశాల జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది.ఆ దేశాల దుష్టమనస్తత్వానికి వారి జర్నలిజం ప్రతీకగా ఉందని, మధ్యప్రాచ్య దేశాలలో విషాదాలు సర్వసాధారణమే అన్నట్లు చిత్రిస్తున్నదని పేర్కొన్నది. యుద్ధ బాధితులు ఎవరైనా ఒకటేనని, అయితే మధ్యప్రాచ్య దేశాల బాధితుల పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘ అధ్యక్షురాలు హుదా ఉస్మాన్ విమర్శించారు. పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఇతర దేశాల పట్ల అలవోకగా, సాదాసీదాగా వివక్షను వెల్లడించటం వృత్తికి తగనిపని అన్నారు. ఇక మన మీడియా విషయానికి వస్తే ఒక మంచి రేటింగుల అవకాశాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. రష్యా పట్ల మన దేశం తటస్ధ వైఖరిని ప్రదర్శించటం దానికి ఒక కారణం. అయినప్పటికీ పశ్చిమ దేశాల మీడియా కథనాలను కొత్త పాకింగులో అందిస్తున్నది. భక్తిప్రపత్తులతో తమపని చేసిపెడుతున్నందున పశ్చిమ దేశాలు మాట్లాడటం లేదు. భారత మీడియా వివక్ష పూరితంగానూ, తప్పుదారి పట్టించే వార్తలను అందిస్తున్నదని రష్యా విమర్శించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ వాస్తవ సమాచారాన్ని భారతపౌరులకు అందించాలని హితవు చెప్పింది. ఉక్రెయిన్లోని అణువిద్యుత్ కేంద్రాలు, చర్చల గురించి తప్పుడు సమాచారాన్ని భారత మీడియా అందించిదని విమర్శించింది. “రష్యా దురాక్రమణ” గురించి భారత మీడియా విమర్శించటం లేదెందుకంటూ బిబిసి ఒక కథనాన్ని రాసింది.యుద్ధాన్ని ఆసరా చేసుకొని రేటింగులను పెంచుకొనేందుకు, తద్వారా సొమ్ము చేసుకొనేందుకు చూస్తున్న అత్యధిక పశ్చిమదేశాల మీడియా సంస్ధలు ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకొనే వారిని గుర్తుకు తెస్తున్నాయి. జనాలను కించపరుస్తున్నాయి, ఏకపక్ష వార్తలు, వ్యాఖ్యానాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ విషయంలో మన మీడియా కూడా తక్కువ తినటం లేదు. తప్పును తప్పని ఖండించలేని నరేంద్రమోడీ సర్కారు మాదిరి యుద్ధానికి అసలు కారకులైన అమెరికా దాని నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలు, ద్వంద్వ ప్రమాణాలను వెల్లడించటంలో మ్యావ్ మ్యావ్ మంటున్నాయి. జనం మీద జరిగే ప్రచారదాడికి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు అణ్వస్త్రాల క్షిపణుల మాదిరి ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News