తిరువనంతపురం: బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగైపోయిందని, తమ పాలనను కీర్తించని మీడియా సంస్థలపై సంఘ్ పరివార్ నిరంతరం వేధింపులకు పాల్పడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిబిసికి చెందిన ఇండియా వార్తావిభాగాన్ని మూసివేసినట్లు వెలువడిన వార్తలపై స్పందించారు. భారతదేశ విదేశీ పెట్టుబడుల నిబంధనలకు లోబడి లండన్‌కు చెందిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) తన భారత విభాగాన్ని మూసివేసినట్లు వార్తలు వెలువడ్డాయని, ఆదాయం పన్ను శాఖ నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుండడంతో బిబిసి ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని విజయన్ చెప్పారు.
బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛ కనుమరుగైపోయిందని, తమ పాలనను కీర్తించని మీడియా సంస్థలను సంఘ్ పరివార్ నిరంతరం టార్గెట్ చేస్తున్నట్లు కనపడుతోందని, ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి రానున్న ఎన్నికలే గొప్ప అవకాశంగా తాము భావిస్తున్నామని విజయన్ తెలిపారు. మీడియాను కట్టడి చేయాలని నియంతలు ఎల్లప్పుడూ భావిస్తారని, బిజెపి పాలనలో మళ్లీ ఎమర్జెనీ రోజులు రానున్నట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయని ఆయన చెప్పారు. తమకు విధేయంగా మీడియా ఉండాలన్నది బిజెపి అజెండాగా ఆయన అభిర్ణించారు. తమకు లొంగిపోని మీడియాను అణచివేయడానికి అటువంటి పాలకులు ప్రయత్నిస్తారని, బిబిసి విషయంలో పాలకుల దాడులు, బెదిరింపులు స్పష్టంగా కనిపింంచాయని ఆయన ఆరోపించారు.
2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ ర్యాంకింగ్ దిగజారిపోయిందని ఆయన ఆరోపించారు. పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌడ్ బార్డర్స్ రూపొందించిన 2023 నివేదిక ప్రకారం భారత పత్రికా స్వచ్ఛ మొత్తం 180 దేశాలలో 150 నుంచి 161వ ర్యాకుకు పడిపోయిందని ఆయన చెప్పారు. సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ఏ రకమైన వేధింపులు జరుగుతున్నాయో దేశం యావత్తు చూసిందని విజయన్ చెప్పారు. ఢిల్లీ అల్లర్లపై 2020లో వార్తలు ప్రచురించిన కేరళలోని రెండు మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. కేరళలో ఈ నెల 26న ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.