తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్‌లో ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఒక చానెల్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, నేనూ కలసి ఇంటర్వ్యూ చేసిన కార్యక్రమం ప్రసారం చేసింది. రేవంత్ రెడ్డి నోటినుంచి మాటలు దూకుడుగా వస్తున్నాయనీ, ప్రశాంతంగా మాట్లాడితే బాగుంటుందనీ సూచించాను. తక్కిన ప్యానలిస్టులు కూడా ఏకీభవించారు. ‘ఎదుటివాళ్ళు ఫుట్ బాల్ ఆట కాలితో ఆడుతుంటే నన్ను చేతితో ఆడమంటున్నారు. ఎట్లా సాధ్యం?’ అని రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. ఎన్నికలు అయిన తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావును కలిసినప్పుడు ‘మీరు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిగారు అనండి. దానివల్ల మీకే మంచి పేరు వస్తుంది’ అని సలహా చెప్పాను. ఇద్దరూ నా సలహా పాటించలేదు. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. దరిమిలా రాజకీయాలలో సంభాషణ నానాటికీ తీసికట్టు అన్న విధంగా ఎంత దిగజారిందో అందరం గమనిస్తూ, బాధపడుతూనే ఉన్నాం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలూ (లెజిస్లేచర్), అధికార యంత్రాంగం (ఎగ్జిక్యుటీవ్), న్యాయస్థానాలూ (జుడీషియరీ) మూడు స్తంభాలు. ఆ మూడూ బీటలువారి బలహీనపడకుండా ప్రజాస్వామ్య సౌధాన్ని నిటారుగా నిలిచి ఉండేలా చూసే బాధ్యత నాలుగో స్తంభమైన మీడియాది. అందుకే దాన్ని పోర్త్ ఎస్టేట్ అన్నారు. ‘గోదీ మీడియా’గా మారి ప్రధాన స్రవంతికి చెందిన పత్రికలూ, టీవీ చానళ్ళూ అధికారంలో ఉన్నవారి ఒడిలో కూర్చొని వారి భజన చేస్తుంటే సోషల్ మీడియా ప్రాముఖ్యం పెరిగింది.
మా తరం కంటే ముందు తరంవారికి 1955లో ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు జరినప్పుడు కమ్యూనిస్టు పార్టీనీ, బసవపున్నయ్య వంటి నాయకులనూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు చీల్చిచెండాడిన ఉదంతం గుర్తు ఉండే ఉంటుంది. నార్లవారు కాంపెయిన్ జర్నలిజానికి ఆద్యుడు. ఆ ఎన్నికలలో గెలుస్తారని అనుకున్న కమ్యూనిస్టులు ఓడిపోవడానికి ఈ సంపాదకులు కొంతవరకు కారణం. అదంతా ఎన్నికల వరకే పరిమితం. వారిద్దరూ తెలుగు పత్రికా వ్యవస్థలో వరిష్ఠ సంపాదకులుగా పేరుప్రతిష్ఠలు కలిగినవారు. 1969లో తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ‘బిడ్డా బ్రహ్మనంద రెడ్డీ’ అని సంబోధించేవారు. ముఖ్యమంత్రి సతీమణి రాఘవమ్మనూ అసభ్యంగా దూషిస్తూ గోడల మీద రాతలు వెలిశాయి. తర్వాత ఉద్యమ నాయకులే అటువంటి రాతలను వ్యతిరేకించడంతో అవి ఆగిపోయాయి. ప్రత్యేక తెలంగాణ మలి ఉద్యమ నాయకుడూ, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ మాట కటువుగా ఉండేది కానీ రాజకీయాలతో సంబంధంలేని కుటుంబ సభ్యులపైన నిందారోపణలు ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని మర్యాదలూ మంటగలిశాయి. ఎన్నికల తర్వాత సైతం వ్యక్తిగత ద్వేషాలతో హద్దులు మీరి చెలరేగిపోతున్నారు. ఈ వాతావరణాన్ని చూసి భరించలేక సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఎమెస్కో ప్రచురణ సంస్థ యజమాని విజయకుమార్, నేనూ చొరవ తీసుకొని కొన్ని మాసాల కిందట హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించాం. నిగ్రహం, నైతికత పాటించవలసిందిగా మీడియా పెద్దలకూ, రాజకీయ నాయకులకూ విజ్ఞప్తి చేశాం. అదే రకమైన సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాం.
కొన్ని పార్టీలకి సొంత పత్రికలూ, చానళ్ళూ, వెబ్ సైట్లూ ఉన్నాయి. మరికొన్ని పార్టీల అధినాయకుల ఎజెండా, కొందరు పత్రికాధిపతుల ఎజెండా ఒక్కటే కావడం వల్ల దాని ప్రభావం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. అన్ని పార్టీలూ శక్తికొలది సోషల్ మీడియా వ్యవస్థలను పోషిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ కార్యక్రమాలపైన దృష్టిపెట్టడం, ఆ పార్టీని ఎండగట్టడం, దుష్ప్రచారం చేయడం, అప్రతిష్ఠపాలు చేయడం వాటి పని. సోషల్ మీడియాలో పని చేస్తున్న కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల మెప్పుకోసం వారిని ఆకాశానికి ఎత్తుతూ, వారి ప్రత్యర్థులను నేలబారుగా చూపుతున్నారు. ఈ క్రమంలో మహిళలను సైతం ఉపేక్షించడం లేదు. ఇటువంటివారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపణ. ఎవరు నికార్సయిన జర్నలిస్టో, ఎవరు కాదో నిగ్గుతేల్చాలని మీడియా యజమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ, మీడియా రంగాలలో బాధ్యులంతా చర్చించుకొని లక్ష్మణరేఖను కొత్తగా నిర్వచించుకొని నియంత్రణ పాటించకపోతే రాష్ట్ర ప్రతిష్ఠ మరింత దిగజారుతుంది.
– కొండుభట్ల రామచంద్రమూర్తి
(సీనియర్ సంపాదకులు)