Tuesday, April 1, 2025

మీడియా పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

- Advertisement -
- Advertisement -

పాత్రికేయం- ప్రమాణాలు

తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా మీడియా రంగం దుస్థితికి, పెడపోకడలకు రాజకీయనేతల సహా అందరూ బాధ్యులే. ఒకప్పుడు రాజకీయ సేవ, పత్రికా సేవ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు. ఇప్పుడు రాజకీయం కాస్ట్లీ వ్యాపారమైంది. రాజకీయ అధికారముంటే ఏదైనా సాధించవచ్చు, తిరుగేఉండదన్న భావనలు ప్రబలమవడంతో దాని కోసం అర్రులు చాస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమం లో పత్రికలు, చానళ్లు, సోషల్ మీడియాలు పావులుగామారి పల్లకీ సేవలందిస్తున్నాయి.

గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వగచి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా సమయం మించిపోలేదు. అవినీతి ఊబిలో కూరుకుపోతున్న వ్యవస్థలన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేయగలిగితే మీడియా వ్యవస్థ కూడా దారికివస్తుంది. ఒక్క మీడియాను మాత్రమే వేరు చేసి సరిదిద్దుతామని, నీతి పాఠాలు బోధిస్తామని అంటే కుదిరే పనికాదు. మీడియా పిల్లిమెడలో ఎవరు గంట కడతారన్నదే అసలు ప్రశ్న. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కొన్ని సూచనలు నాకు తోచినవి పొందుపరుస్తున్నాను. వాటితోనే సమస్య కొలిక్కి వస్తుందన్న ఆశలేమీ నాకు లేవు.
రాజకీయ నాయకులు

1. ఏ స్థాయి రాజకీయ నాయకులైనా పదవులతో నిమిత్తం లేకుండా తమ ప్రచార అవసరాల కోసం మీడియా వారిని దువ్వటం, ప్రలోభపెట్టడం, ప్రసన్నం చేసుకోవడం, ప్రత్యర్థులపై ఎగదోయటం వంటి అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
2. ఏ మీడియాలో పని చేస్తున్న రిపోర్టర్లయినా తమ వృత్తిధర్మాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారనే స్పృహ నేతలకు ఉండాలి. మీడియా సమావేశాల్లో కొంతమంది విలేకరులను మీడియా పేరు పెట్టి గేలి చేయటం, కించపరచటం వంటి దుందుడుకు పనులను మానుకోవాలి.
3. ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను కించపరటానికి, ట్రోల్ చేయటానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను నిర్వహించటం, వాడుకోవటం మానుకోవాలి.
4. అధికార, ప్రతిపక్ష నాయకులు, అసెంబ్లీ సహా ఏ బహిరంగ వేదికలోనూ ప్రత్యర్థులపై బరితెగించి అసభ్యంగా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ పాటించాలి.
5. ద్వితీయ శ్రేణి నాయకులు తమ అధినాయకుడి దృష్టిని ఆకర్షించటానికి నోటికి ఇష్టం వచ్చినట్లు ప్రత్యర్థుల గురించి మాట్లాడితే పర్యవసానాలు తామే ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించాలి.
6. రాజకీయమనేది ప్రజలకోసం నిర్దేశించిన స్వచ్ఛంద సేవ అనే మౌలిక సత్యాన్ని గుర్తించి ప్రజాసమస్యలపై నిరంతర అధ్యయనం, విషయావగాహనతో సబ్జెక్ట్‌కు పరిమితమై మాట్లాడాలి.
7. సొంత పత్రికలు, టివి ఛానళ్లలో తమ గురించి ఎంత బాకాలూదినా గెలుపు ఓటములను అది ప్రభావితం చేయటం లేదు. మీడియా క్రమేణా విశ్వసనీయత కోల్పోతోంది. పార్టీ తరపున మీడియా సంస్థలను కొనసాగిస్తున్నా అన్ని పార్టీల వాదనలు, అభిప్రాయాలకు సముచిత స్థానం కల్పించి, అంతిమ నిర్ణయాన్ని ప్రజలకే వదిలివేయటం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు.
సోషల్ మీడియా కట్టడికి
1. ఇ మెయిల్ ఉన్నవారెవరైనా ఏ ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌తో పనిలేకుండా సులువుగా యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించి పాపులారిటి కోసం, వ్యూస్ ద్వారా ఆదాయార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బాధ్యత గల యూ ట్యూబర్లు చాలా కొద్ది మంది. యూట్యూబర్ల కట్టడికి ఐ.టి చట్టాలను మరింత పటిష్టం చేయాలి.
2. యూ ట్యూబర్లను ఏ ప్రాతిపదికనైనా సరే జర్నలిస్టులుగా గుర్తింపునిస్తే అది తేనె తుట్టెను కదిలించినట్లవుతుంది. అక్రిడిటేషన్ కార్డులు, ఇతర సౌకర్యాల కోసం బారులు తీరుతారు.
3. చిన్న పత్రికలు, ఆన్‌లైైన్ పత్రికలకు సైతం ఆర్‌ఎన్‌ఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచార శాఖలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆ పత్రికకున్న ఏజెన్సీ అవుట్ లెట్లు, కాపీల అమ్మకాలు వంటివి. స్వతంత్రంగా మదింపు చేయాలి. నిర్ణీత వార్తా ప్రమాణాలు పాటిస్తూ సిబ్బందికి సక్రమంగా జీతభత్యాలు చెల్లిస్తూ తగినంత సర్కులేషన్ ఉన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయాలి.
ఎడిటర్లు, ఛానళ్ల సి.ఇ.ఒలు
1. కీలక స్థానాల్లో ఉన్నవారిలో కొందరు తమ యజమానినో, పొలిటికల్ బాసునో మెప్పించటానికి వృత్తిప్రమాణాలను వదిలేసి ఎంతటి నైచ్యానికైనా దిగజారటం విషాదం. ఇలాంటి వారు ఆ పదవికే అనర్హులు. బాసు ఏదైనా చేస్తే, దాన్ని జీ హుజూర్ అని పాటించకుండా పర్యవసానాలను విడమరచి చెప్పగలగాలి
2. ఎడిటర్లు, ఛానళ్ల సి.ఇ.ఒలు ఉమ్మడి వేదికనో, సమన్వయ సంఘాన్నో ఏర్పాటు చేసుకుని కనీసం నెలకోమారు విధిగా సమావేశమవుతూ ఆ నెల రోజుల వార్తల కవరేజీలపై పోకడలపై నిష్పాక్షిక చర్చ జరిపి, దిద్దుబాటు చర్యలకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఈ సమావేశ సమీక్షలు, నిర్ణయాల మినిట్స్‌ను అటు యజమానులకే కాక, తమ కొలిగ్స్‌కూ సర్కులేట్ చేసి అమలయ్యేట్లు చూడాలి.
జర్నలిస్టు సంఘాలు
1. జర్నలిస్టు సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, ప్రెస్ క్లబ్‌లు తమ సభ్యత్వ నియమావళిని కట్టుదిట్టం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలు లేకుండా సభ్యులను చేర్చుకోవడంతో సంఖ్యా బలం రీత్యా ఆయా సంఘాల ఎన్నికల్లో కొందరు పట్లు ప్రాబల్యం పొంద వచ్చేమోగాని మీడియా విశాల ప్రయోజనాలకు తీరని విఘాతం కలుగుతుంది.
2. అక్షరమ్ముక్క రాయటం చేతకాకున్న కొంతమంది ఘోస్ట్ రైటర్ల చేత వార్తలు, వ్యాసాలు రాయించి తమ పేరిట ప్రచురించుకుంటూ, ఆ క్లిప్పింగ్‌లు మాటున జర్నలిస్టు ముద్ర వేసుకుని సభ్యత్వాలు పొందుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
3. జర్నలిస్టుల వృత్తి కౌశలాన్ని పెంచటానికి మీడియా అకాడమీకి, జర్నలిస్టు సంఘాలు శిక్షణ తరగతులు నిర్వహించాలి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మెరుగుపరచాలి.

గోవిందరాజు చక్రధర్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News