Friday, December 27, 2024

జూబ్లీహిల్స్ సొసైటీలో కోల్డ్‌’వార్’

- Advertisement -
- Advertisement -

ఎన్ టీవీ, టీవీ5 మధ్య మీడియా వార్
జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి మీడియా అధినేతల తొలగింపు
ముదురుతున్న జూబ్లీహిల్స్ సొసైటీ వివాదం
నరేంద్ర చౌదరితోపాటు నలుగురి సభ్యులను సొసైటీ నుంచి తొలగించిన పాలక మండలి
సొసైటీ ప్రతిష్ట కాపాడేందుకే తొలగింపు ః బి.రవీంద్రనాథ్
నోటీసులు లేకుండా ఎలా తొలగిస్తారని నరేంద్ర చౌదరి ఆగ్రహం

మన తెలంగాణ / పంజాగుట్ట: తెలుగు రాష్ట్రాల్లో వివాదాలతో బహుళ ప్రాచుర్యం పొందిన జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం మరో కీలకమైన నిర్ణయం తీసుకొంది. ప్రముఖ ఛానెల్ ఎన్.టి.వి.అధినేత నరేంద్ర చౌదరితో పాటుగా మరో నలుగురు సభ్యులను సొసైటీ నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకొంది. సొసైటీలో వివాదాస్పదమైన వ్యక్తులుగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నరేంద్రచౌదరి, సి.వి.ఆర్.ఛానెల్ అధినేత సీ.వీ.రావు, టి.హనుమంతరావు, మురళి ముకుంద్, కిలారి రాజేశ్వరరావులను జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి కూడా తొలగిస్త్తున్నట్లుగా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. సొసైటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా టీవీ5 అధినేత బి.రవీంధ్రనాథ్ నాయుడు గెలుపొందారు. ఇక అప్పట్నుంచీ టీవీ5 రవీంద్రనాథ్ వర్గానికి, ఎన్.టి.వీ.అధినేత నరేంద్రచౌదరి వర్గానికి మధ్య ఆధిపత్యపోరు జరుగుతూనే ఉంది. దీంతో ప్రముఖ టీవీ ఛానెళ్ళ అధినేతల మధ్య ఆధిపత్యపోరుగా మారింది.

ఈ ఆధిపత్యపోరులో భాగంగానే ఎన్.టి.వి, సీ.వి.ఆర్.ఛానెల్ అధినేతలపై టి.వీ.5అధినేత వేటు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్.టి.వి.అధినేత నరేంద్ర చౌదరి వర్గాన్ని సొసైటీ నుంచి తొలగించిన అంశాన్ని సొసైటీ అధ్యక్షుడు, టీవీ5 అధినేత బి.రవీంధ్రనాథ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా తొలిసారిగా ఈ సర్వసభ్య సమావేశానికి రికార్డుస్థాయిలో 750 మందికి పైగా సభ్యులు హాజరైనట్లు సొసైటీ అధ్యక్షుడు రవీంధ్రనాథ్ పేర్కొన్నారు. అయితే తమ సభ్యత్వం తొలగించడంపై ఎన్.టి.వి.అధినేత నరేంద్ర చౌదరి, మరో నలుగురు సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అసలు మాకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారు అంటూ కార్యదర్శి మురళి ఒక ప్రకటన విడుదల చేశారు. సొసైటీ రిజిస్ట్రార్ సైతం మాకు అన్యాయం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని, తాము న్యాయ స్థానంలో పోరాడతామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం కాస్తా ఎన్.టి.వి, టివీ5 మధ్య కోల్డ్‌వార్‌లా మారిందనే విమర్శలున్నాయి.

జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో సభ్యత్వాలను తొలగించిన అయిదుగురు సభ్యులపైన అనేక రకాల విమర్శలు, ఆరోపణలు రావడం, సొసైటీ పాలకవర్గ ఎన్నికల్లో సైతం వీరు వ్యవహరించిన తీరుపై మిగతా సభ్యులంతా ఆగ్రహంతో ఉన్నారని, అందుకే వారిని శాశ్వతంగా సొసైటీ నుంచి బయటకు పంపించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొన్నామని పాలకవర్గం సభ్యులు కొందరు వివరించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయని, అయితే ఇటీవల జరిగిన అనేక పరిణామాలు సొసైటీ ప్రతిష్టకు భంగం కలిగించాయని, అందుకే గత్యంతరం లేకనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ మీడియాకు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే స్థానికుల సంక్షేమం కోసం 1962లో జూబ్లీహిల్స్ కోఆపరేటీవ్ సొసైటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీగా మారింది.

జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ప్రజల కోసం అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొసైటీకి 1964లో 1398 ఎకరాల స్థలాన్ని కేటాయించి సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించేలా జి.ఓ 147 విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ సొసైటీ వేలమంది సభ్యులతో విస్తరించి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను పలువురికి కేటాయించడమే కాకుండా కోట్ల విలువైన ఆస్థులు సొసైటీకి ఉన్నాయి. ఈ సొసైటీలో ఆధిపత్యం సాధించడం కోసం, సొసైటీ ఎన్నికల్లో గెలుపొందడం కోసం కూడా బరిలో ఉండే అభ్యర్ధులు భారీగానే ఖర్చు చేస్తారనే ఆరోపణలూ ఉన్నాయి. గత పదిహేనుళ్లకుపైగా ఈ మీడియా సంస్థల అధినేతలు ఈ సొసైటీపై పట్టు సాధించారని, అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు, వివాదాలకు తెరదించేందుకే ఈ అయిదుగురిపైన వేటు వేయాల్సి వచ్చిందని అధ్యక్షుడు బి.రవీంధ్రనాథ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News