Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం ఆ మూడు దేశాలకే సాధ్యం: పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం నివారించడానికి శాంతి చర్చలకు భారత్, చైనా,బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌తో నిర్విరామ పోరుసాగిస్తున్న రష్యా శాంతి చర్చలను ప్రస్తావించడం ముఖ్యమైన పరిణామం. వ్లాదివాస్తోక్‌లో జరుగుతున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా పుతిన్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయన్‌లో పర్యటించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపిన రెండు వారాలకు పుతిన్ నుంచి శాంతి చర్చల ప్రస్తావన రావడం గమనార్హం. “మా మిత్రులను, భాగస్వాములను మేం గౌరవిస్తాం.

యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారే పరిష్కరించగలరన్న విశ్వాసం ఉంది. ప్రధానంగా చైనా, బ్రెజిల్, భారత్ ఈ పని చేయగలరు.ఈ అంశంపై వారితో నిరంతరం తాను సన్నిహితంగా ఉన్నాను ”అని పుతిన్ పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ అత్యంత నిర్మాణాత్మక, స్నేహపూర్వక సంబంధాలు పుతిన్, మోడీ మధ్య ఉన్నాయని, ఉక్రెయిన్‌తో యుద్ధ సంక్షోభాన్ని నివారించే మధ్యవర్తిత్వానికి మోడీ నాయకత్వం వహించగలరని పేర్కొన్నారు.

ప్రపంచ వ్యవహారాల్లో తన పలుకుబడిని ఉపయోగించుకోడానికి భారత్‌కు ఇది మంచి అవకాశమని తెలిపారు. అయితే మోడీ మధ్యవర్తిత్వానికి సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక ఏదీ లేదని వివరించారు. ఆగస్టు 23 న ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. యుద్ధం పరిసమాప్తం కావడానికి సమయం వృధా చేయకుండా ఉక్రెయిన్, రష్యా దేశాలు రెండూ తప్పనిసరిగా చర్చించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఒప్పించారు. శాంతి పునరుద్ధరణకు క్రియాశీలక పాత్ర వహించడానికి భారత్ సిద్ధమేనని స్పష్టం చేశారు. రష్యా సందర్శన తరువాత ఆరు వారాలకు మోడీ ఉక్రెయిన్‌ను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News