నీట్ ఫలితాలు మొదటివారంలో వెలువడే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైద్య విద్యలో ప్రవేశాలకు దేశవ్యాప్ంతగా నిర్వహించిన నీట్ 2021 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాలు మొదటి వారంలో వెలువడే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన వారం పది రోజుల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 83,275 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కాలేజీలు 289 ఉంటే, వాటిలో 43,435 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. 269 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 39,840 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటో ఉన్నాయి. మెడికల్ కౌన్సిలింగ్‌లో ముందు అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లు, తర్వాత రాష్ట్ర కోటాలో ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం అంటే, 6,515 సీట్లను అన్ని రాష్ట్రాల నేషనల్ పూల్‌కు ఇస్తాయి. వాటిని జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో రెండుసార్లు కౌన్సెలింగ్ జరిగాక, నేషనల్ పూల్‌లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు.
ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు…విద్యార్థుల్లో ఆందోళన
ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు మరో రెండు వారాలలో వెలువడే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి మొత్తం 55 వేల మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 5,240 ఎంబిబిఎస్ సీట్లున్నాయి. అందులో 11 ప్రభుత్వ కాలేజీల్లో 1,790 సీట్లు, 23 ప్రైవేట్ కాలేజీల్లో 3,450 ఎంబిబిఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వంలోని సీట్లల్లో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లల్లో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు.
15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది. విద్యార్థులందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది..? ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం విద్యార్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్‌లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది.